రంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పాలమూరు రంగారెడ్డిపై కాంగ్రెస్ నేతలు వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలడంపై ఉమ్మడి రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి పైసా ఇవ్వని రేవంత్ సర్కారు వాస్తవాలు మాట్లాడిన కేసీఆర్‌ను విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు అనంద్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, సీనియర్ నాయకులు క్యామ మల్లేశ్, రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డితో కలిసి మీర్‌పేటలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్‌రెడ్ది పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించిందని చెప్పారు. రూ. 30 వేల కోట్లతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారన్నారు. అందులో రూ.27వేల కోట్లతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. రెండు కిలోమీటర్ల కాల్వలు తవ్వితే నీళ్లు వస్తాయని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పాలమూరు -రంగారెడ్డి పథకంపై రేవంత్ సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరిని ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ నేతృత్వంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.