వలిగొండ/కోడేరు, జనవరి 19 : రూ.లక్షలు అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిర్మిస్తే రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్లు సోమవారం నిరసనకు దిగారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఎంట్రన్స్ గేటుకు తాళం వేశారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి పథకం కింద కోడేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు, మరమ్మతులకు రూ.39 లక్షలు, బాలుర ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.32 లక్షలు, బాలికల ప్రాథమిక పాఠశాల భవనానికి రూ.25 లక్షలతో పనులు చేపట్టినట్టు కాంట్రాక్టర్లు సురేశ్‌శెట్టి, వెంకట్‌రెడ్డి, బద్దుల శేఖర్ తెలిపారు.
అప్పటి ప్రభుత్వం రూ.42 లక్షల బిల్లులు చెల్లించగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మిగిలిన రూ.48 లక్షల పెండింగ్ బిల్లులు చెల్లించలేదని వాపోయారు. పనులు చేసేందుకు తెచ్చిన అప్పులు తడిసి మోపెడై ఇబ్బందులు పడ్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదిలేక పాఠశాలల గేటుకు తాళం వేసినట్టు తెలిపారు. పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరుబయటే పడిగాపులు కాశారు. ఉపాధ్యాయులు ఎంఈవో భాస్కర్‌శర్మకు ఫోన్లో సమాచారం ఇవ్వగా..స్పందించిన ఆయన సమస్యను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
దీంతో కాంట్రాక్టర్లు గేటు తాళం తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం ఉన్నత పాఠశాలకు మన ఊరి మనబడిలో భాగంగా రూ.28 లక్షలు మంజూరయ్యాయి. మాజీ సర్పంచ్ కీసరి రాంరెడ్డి పాఠశాల నిర్మాణ పనులను 2023 డిసెంబర్లో పూర్తి చేశారు. రూ.28 లక్షలకు గాను రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, పాఠశాల నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక పాఠశాలకు గేటుకు తాళం వేసినట్టు రాంరెడ్డి తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు మాజీ సర్పంచ్‌తో మాట్లాడి బిల్లుల విషయంలో సహకరిస్తామని హామీ ఇవ్వడంతో పాఠశాల గేటు తాళాన్ని తీయించారు.