హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు చూపుతున్న కపట ప్రేమ తేటతెల్లమైంది. రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి ఆడుతున్న దాగుడుమూతలు బయటపడ్డాయి. బీసీ రిజర్వేషన్లు చేశామంటూ నమ్మిస్తూనే.. బీసీ సంఘాలు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన సర్కార్.. నిరసనలో పాల్గొన్న ఉద్యోగులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నది. ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టింది. ప్రతి ఉద్యోగి జీతం నుంచి ఏకంగా రూ. వెయ్యి నుంచి రూ. 2వేల చొప్పున కోత విధించింది. బీసీ సంఘాల ఉద్యమంలో పాల్గొనడమే ఉద్యోగులు చేసిన తప్పిదంలా వ్యవహరిస్తున్నది. ఉన్నతాధికారులను ఒత్తిడి చేసి మరీ జీతాలు కోసేసింది. నవంబర్ 18న జరిగిన బీసీ బంద్‌లో అన్ని వర్గాలతోపాటు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
అలాగే ఈ బంద్‌కు రేవంత్ సర్కారు సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మెహిదీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన 700 మంది ఉద్యోగులు కూడా బంద్‌కు మద్దతు తెలిపి, ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో ఆ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టింది. కాగా మస్టర్ ఇచ్చిన జీతంతో కేవలం వారికి మాత్రం ఆ రోజు సాలరీలో కోత పెట్టారు. ఆర్ఎంను అడుగగా.. ప్రభుత్వ ఆదేశాలంటూ చెప్పారు. దీంతో ఉన్నతాధికారులను కలిసి జీతాల కోతపై మొర పెట్టుకోగా.. ప్రభుత్వ ఆదేశాలతోనే జరిగాయని, తాము ఏం చేయలేమని సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమది ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ సర్కారు.. నిరసనలో పాల్గొన్న ఉద్యోగులను వేధింపులకు గురిచేయడంపై పలువురు బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బీసీ ఉద్యమం విషయంలో ప్రభుత్వం మీనమేషాలను ఆపేయాలని, ఉద్యోగులకు కోల్పోయిన జీతాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.