హిమాయత్ నగర్, జూలై 13: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన తగిన గుణపాఠం చెప్పాలని వివిధ బీసీ సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల అమలు పేరిట ఆర్డినెన్స్ తెచ్చి బీసీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
బీసీలకు కొండంత ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలను అమలు చేయకుండా దాటవేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చ రించారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆదివారం మీడియా సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్‌యాదవ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, గౌడ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ గోపి మాట్లాడారు.
తరుచూ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాలు తెచ్చిన రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్‌లను కోర్టులు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బీసీ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.