హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎలాంటి ఆధారాలు లభించని ఫోన్‌ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి లీకులు ఇస్తూ హల్చల్ సృష్టిస్తున్నది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా ఈ ఫోన్‌ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి ప్రజా సమస్యలను మరుగున పడేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మరోసారి లీకులు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఈసారి ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా నియమించిన స్పెషల్ సిట్ (దర్యాప్తు బృందం) వారిని విచారించబోతున్నదని, అందుకు నిర్ణయం తీసుకున్నామని తమ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో సదరు మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలను వండివారుస్తున్నాయి.
నోటీసుల ఊసే లేదు..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో కీలక నేతల పాత్రపై ఆరా తీయడానికి వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జోరందుకున్నది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత వారికి నోటీసులు జారీచేస్తారన్నది ఆ లీకుల సారాంశం.
నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: బండి
‘ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పందించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వ లీకుల ఆధారంగా ఆయన.. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛనివ్వాలని అన్నారు. బడా పారిశ్రామికవేత్తలు, లీడర్లు, వ్యాపారులను ఫోన్‌ట్యాపింగ్ పేరు తో బెదిరించి డబ్బులు వసూలుచేసిన వ్యవహారంపై నిగ్గు తేల్చాలని అన్నారు.
‘అనుకూలంగా చెప్తేనే నీకు విముక్తి’
బీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును పోలీసులు రోజూ సుమారు 12 గంటలకు పైగానే విచారిస్తున్నట్టు తెలిసింది. మొదటిదశ కస్టోడియల్ ఇంటరాగేషన్‌లో సిట్‌కు అనుకూలంగా సమాధానాలు చెప్పకపోవడంతో.. మరో వారం పోలీసు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో గడువు కోరింది. విచారణ పేరుతో వేధించారని, తాము కోరినట్టు సాక్ష్యం చెప్తేనే విముక్తి కల్పిస్తామని, లేదంటే ఏడేండ్లు జైలు తప్పదని దర్యాప్తు అధికారులు బెదిరించడాన్ని ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.