హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్టర్ పోస్టులకు ఆంధ్రా ఆఫీసర్ల చేతుల్లో పెట్టబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ బిడ్డలను పక్కనబెట్టి మరీ ఆంధ్రా అధికారులకు స్వాగతం పలుకుతున్నారని, ఇందుకు సర్కారు పెద్దలు కూడా ఓకే అనేశారని గుసగుసలు. ట్రాన్స్‌కో, టీజీఎస్పీడీసీఎల్ సహా ఇతర విద్యుత్తు సంస్థల అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ ఆంధ్రా అధికారులకు అప్పగించబోతున్నారని విద్యుత్తుసౌధ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో ఆయా పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు కూడా విడుదల కానున్నట్టు సమాచారం. ఈ తతంగం వెనుక పెద్ద ఎత్తున చేతలు మారినట్టు ప్రచారం జరుగుతున్నది. కొందరు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగు సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీచేసి, దరఖాస్తులను ఆహ్వానించారు. ఆయా పోస్టులకు దాదాపు 150 దరఖాస్తులు వచ్చాయి. వీరికి ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూలను సైతం నిర్వహించారు. అర్హతలు లేని కొందరిని ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు చేయడంపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇంటర్వ్యూల అనంతరం ఎంపిక కమిటీ ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున షార్ట్‌లిస్ట్ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ జాబితా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లింది. జాబితాలోని పేర్లున్న వారిపై ఇంటెలిజెన్స్ విచారణ కూడా పూర్తయింది. అవినీతి, ఏసీబీ ఇతర కేసులు, వారి పనితీరుపై పరిశీలన సైతం ముగిసింది. ఈ తరుణంలోనే పైరవీలు మొదలయ్యాయి. కేసులున్న వారు, ఆరోపణలున్న వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున సమర్పించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాబితా మొత్తం తారుమారైనట్టు విద్యుత్తు సౌధలో ప్రచారం జరుగుతున్నది. అన్ని స్థాయిల్లో కొన్ని పేర్లు గల్లంతుకాగా, కొన్ని కొత్త పేర్లు వచ్చి చేరినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
ట్రాన్స్‌కో ప్రాజెక్ట్స్, ట్రాన్స్మిషన్ డైరెక్టర్ పోస్టుల్లో ఒకదానికి ఆంధ్రా అధికారి పేరు ఎంపిక చేస్తారని ప్రచారంలో ఉన్నది. జెన్కో ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టును కూడా ఆంధ్రా అధికారికే కట్టబెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో రెండు డైరెక్టర్ పోస్టులకు వివాదాస్పద అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. తనకు సన్నిహితుడైన సీజీఎం స్థాయి అధికారి కోసం ఓ సీఎండీ పట్టుబడుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్లుగా పనిచేస్తున్న తెలంగాణ వారిని పక్కన పెట్టినట్టు సమాచారం. వీరికి అవకాశాలు తక్కువన్న ప్రచారం జరుగుతున్నది.
ఆంధ్రా అధికారులను డైరెక్టర్లుగా నియమించే ప్రయత్నాలపై విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రా అధిపత్యంపై మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై కొన్ని ఉద్యోగ సంఘాలు, ఇంజినీర్ల సంఘాల బుధవారం ముందస్తుగా భేటీ అయ్యాయి. ఆంధ్రా అధికారులను డైరెక్టర్లుగా నియమించడం- పర్యవసానాలపై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. స్వరాష్ట్రంలో ఈ వివక్ష ఏమిటని, ఆంధ్రా అధికారులకు పెద్దపీట వేయడమేమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై గురువారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి తమ నిరసనను వ్యక్తం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రా అధికారులను నియమిస్తే మరో ఉద్యమానికి వెనుకాడొద్దని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. సమ్మెకు దిగాలని, సర్కారును స్తంభింపజేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతల ద్వారా తెలుస్తున్నది.