Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఒక్కో పథకాన్ని అటకెక్కిస్తూ.. ఒక్కో హామీకి తిలోదకాలిస్తూ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కారు మరో స్కీమ్‌కు రాంరాం చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. సంక్రాంతి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పలు సందర్భాల్లో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ప్రకటనలకు అనుగుణంగా పని మాత్రం కావడం లేదని సమాచారం. సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాలశాఖ కనీస చర్యలు కూడా ప్రారంభించలేదని తెలుస్తున్నది. మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం సన్న బియ్యం పంపిణీకి మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటివరకు సన్న బియ్యం అస్సలే సేకరించలేదు. మరో ఆరు నెలలకు అవసరమైన దొడ్డు బియ్యం సేకరణ కోసం అధికారులు మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పట్లో సన్న బియ్యం పంపిణీ లేనట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ పెద్దల ఆలోచన బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్న ధాన్యానికి బోన స్ ఇస్తున్నందున అధిక విస్తీర్ణంలో సన్నాలు సాగవుతాయని, వాటి ద్వారా సన్న బియ్యం ఇవ్వొచ్చని ఆలోచించినట్టు తెలుస్తున్నది. ఇందుకు విరుద్ధంగా పౌరసరఫరాల సంస్థకు సన్నాలు రాకపోవడంపై అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. వాస్తవానికి సన్న బి య్యం పంపిణీకి ఏటా 24లక్షల టన్నుల బి య్యం, 36లక్షల టన్నుల ధాన్యం అవసరం. కానీ ఇప్పటివరకు సివిల్ సైప్లె సంస్థ 10 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకో 5లక్షల టన్నులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మరో 20 లక్షల టన్నుల ధాన్యం తక్కువ పడుతున్నది. ఇంత భారీస్థాయిలో సన్న బియ్యాన్ని బయ ట కొనుగోలు చేసి పంపిణీ చేస్తే సివిల్ సైప్లెపై భారీ ఆర్థిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో రేషన్‌లో సన్న బియ్యం పంపిణీ వాయిదా వేసినట్టు తెలుస్తున్నది.