సారంగాపూర్, మార్చి 5: ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందక రైతులు అల్లాడిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.బుధవారం ఆమె జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం శివారులోని నాయకపు గూడెంలో పర్యటించారు. స్థానిక రైతులతో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుష్కలమైన జలాలతో బంగారు పంటలు పండించిన రైతులు, కాంగ్రెస్ పాలనలో నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్క ఎండిన పంటలను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. పోతారంలో హన్మంతరావు కుంటలో నీరులేక ఈ సీజన్లో దాదాపు 60 ఎకరాలు బీడు పెట్టుకునే పరిస్థితి రావడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రేచపల్లి నుంచి కెనాల్ ద్వారా అధిక మోతాదులో నీటిని విడుదల చేస్తే హన్మంతరావు కుంటలోకి నీళ్లు వస్తాయని, కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడితే రెండ్రోజుల కిందనే నీటిని వదిలి పెట్టామని చెప్తున్నారని, ఇక్కడికైతే నీళ్లు రాలేదని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించి, గ్రామాల్లో పర్యటించి రైతుల బాధలు తెలుసుకోవాలని సూచించారు. నాయకపు గూడెంలో ఎండిన పొలంలో రైతులు పశువులను మేపుతుండగా, అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. రైతులతో కలిసి పొలంలోనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.