హైదదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ. 1.23 లక్షల కోట్ల అప్పు చేసినట్టు శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రశ్నకు గానూ ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకున్న రుణాలెన్ని? దాని పరిధిలోకి రాకుండా తీసుకున్న రుణాలెన్నో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, కే సంజయ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. దీనికి భట్టి సమాధానం ఇస్తూ, 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ రుణాలు, ప్రభుత్వేర రంగాలకు ఇచ్చిన గ్యారెంటీల వివరాలు వెల్లడించారు. నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న రుణాలు రూ. 51,277.71 కోట్లు అని, కార్పొరేషన్లు, ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బీఎం యేతర రుణాలు రూ. 61,991.14 కోట్లు అని, ఇతర రుణాలు రూ. 10,099.70 కోట్లు అని తెలిపారు. తమ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి అప్పులు చేయబోదని చెప్పారు.
ఇప్పుడే చెల్లించమనాలా?
అప్పులపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వచ్చే 30 ఏండ్లలో వసూలయ్యే జీఎస్టీని ఇప్పుడే తమకు ఇచ్చేసి ఆ తర్వాత నింపాదిగా దానిని వసూలు చేసుకోవాలని అదానీ, అంబానీలను కోరితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ సభ్యులు ‘రేవంత్-అదానీ భాయ్భాయ్’ అని నినాదాలు చేశారు.
మరో 1,500 కోట్ల రుణం
కాంగ్రెస్ సర్కారు మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. రూ.1000 కోట్ల విలువైన ఒక బాండ్‌ను 23 ఏండ్ల కాలానికి, రూ.500 కోట్ల విలువైన బాండ్‌ను 22 ఏండ్ల కాలానికి ఆర్బీఐకు జారీచేసి ఈ రు ణం పొందింది. ఈ విషయాన్ని ఆర్బీఐ మంగళవారం వెల్లడించింది. ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ. 55,618 కోట్ల అప్పు సమీకరించుకున్నది. నిరుడు డిసెంబర్ 12న ఆర్బీఐ నుంచి రూ.500 కోట్లతో మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది.