Revanth Reddy | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీపై చేతులెత్తేసింది. నిరుపేదలకు ఇంటిజాగలు ఇవ్వలేమని, ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ పర్యటనలో స్థానిక గిరిజనులకు ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు. సీఎం తాజా ప్రకనటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి అనేక హామీలిచ్చారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని అమలుచేస్తామని, ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటిస్థలంలోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఆరు లక్షలు అందజేస్తామని మ్యానిఫెస్టోలోనూ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక హామీల అమలును అటకెక్కించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తాజాగా ఇండ్ల జాగలపై కూడా చేతులెత్తేశారు. సోమవారం అమ్రాబాద్‌లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక చెంచు మహిళలు, గిరిజనులతో సీఎం ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు చెంచు మహిళలు మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలను కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే జాగలు ఇప్పించి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వేడుకున్నారు.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఇండ్ల జాగలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని తేల్చిచెప్పారు. ఇండ్ల జాగలు మీరే చూసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి సమాధానంతో చెంచు మహిళలు అవాక్కయ్యారు. అటు తరువాత చెంచుల వరకు ప్రత్యేకంగా ఏదైనా పథకం ఏర్పాటు చేసి ఇండ్ల జాగలు ఇచ్చే విషయం ఆలోచించాలని మంత్రి సీతక్కకు సూచించారు. ఇండ్ల జాగలు కావాలంటే సీతక్కనే అడగాలని చెంచు మహిళలకు చెప్పారు. సీఎం తాజా వ్యాఖ్యలతో ఇండ్ల జాగల పంపిణీ ముచ్చట కూడా ఉత్తదేనని తేలిపోయింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిర సౌర గిరి వికాసం పథకంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోలార్ పంపు సెట్లను సోమవారం ప్రారంభించారు. ఆ తరువాత కొద్దిసేపటికి ఎదురుగా ఉన్న తోటలకు సోలార్ పంపుసెట్లతో అనుసంధానించిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ప్రారంభమైంది. ముగ్గురు రైతులకు చెందిన నాలుగున్నర ఎకరాల్లోని తోటలకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటుచేశారు.
అయితే, అవి పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే సోలార్ మోటర్ ఆన్ కాగా, స్ప్రింక్లర్లు మూడు వరుసలు మాత్రమే పనిచేశాయి. దీంతో అసహనానికి గురైన సీఎం.. మొత్తం రావా? అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దీంతో ఇది షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తుందని, ఇప్పుడు ఇచ్చిన సోలార్ ప్యానళ్లు.. మొత్తం సిస్టంకు లేవని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ వివరణ ఇచ్చారు. సోలార్ పంపుసెట్టుకు సరిపడా విద్యుత్తు సరఫరా కావడంలేదని, బోరు నీళ్లు కూడా అందడం లేదని కమిషనర్ చెప్పడంతో సీఎం వెంటనే ఆ పొలంలోకి వెళ్లి డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను దగ్గరుండి పరిశీలించారు. ఒకవైపు డ్రిప్ నుంచి నీళ్లు పడుతున్నా మంత్రులందరినీ అక్కడే ఆపడంతో వాళ్లంతా తడిసి ముద్దయ్యారు.
ఇందిర సౌర గిరి వికాస పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కడం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి ఇలా కాళ్లు మొక్కడంతో అక్కడున్న ఇతర అధికారులు విస్తుపోయారు. తొలుత స్వాగతోపన్యాసం చేసిన శరత్ ముఖ్యమంత్రితోపాటు మంత్రులను మహానుభావులు.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
అసలు కొత్తగా ప్రారంభిస్తున్న ఆ పథకం గురించి వివరించడం కంటే ముఖ్యమంత్రిని, మంత్రులను పొగడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమైంది. కార్యక్రమం అనంతరం సభా వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెమొంటోను అందించి, వెంటనే కాళ్లు మొక్కారు. దీంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. వేదిక డిప్యూటీ సీఎం, మంత్రులు ఉన్నప్పటికీ వారికి మెమొంటో ఇవ్వకుండా, కేవలం సీఎంకు మాత్రమే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.