హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలైనా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముస్లిం నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 80లక్షల మంది ఉన్నా వారిక మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలు పెంచుతామని మాట ఇచ్చి ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. మైనార్టీతలకు సబ్‌ప్లాన్ తీసుకొస్తామని డిక్లరేషన్‌లో ప్రకటించినప్పటికీ ఇప్పుడెందుకు ఆ ఊసెత్తడం లేదని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వారికి జీతాలిచ్చే వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తుచేశారు. మైనార్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్ ముసియుల్లాఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు ఇచ్చి ఏఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. వక్ఫ్‌బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి వక్ఫ్ ఆస్తులు కాపాడాలనే చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ రహీముల్లాఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ముస్లింలు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గ్రహించినట్టు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముస్లిం నేతలు అర్షద్ అలీఖాన్, మొయిద్ఖాన్, బద్రద్దీస్, ఒమర్, రహీముల్లాఖాన్ నియాజీ, మునీర్, బాసిత్, అబ్దుల్ ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.