Crop Bonus | బోనస్ ఎగవేతకు రేవంత్ సర్కార్ ప్లాన్.. సన్నాలు 37 నుంచి 7 రకాల కుదింపు వెనుక అసలు కారణమిదే!
Crop Bonus | ధాన్యం బోనస్ పథకాన్ని ఎగవేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పక్కాప్లాన్ వేసిందా? పథకాన్ని ఒకేసారి ఎత్తివేయకుండా పరోక్షంగా కుదించేందుకు సిద్ధపడిందా? అందుకే మార్కెట్లో భారీ డిమాండ్ కలిగిన, కొనుగోలు కేంద్రాలకే రాని సన్నాలకు బోనస్ ప్రకటించిందా.
Crop Bonus | హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): ధాన్యం బోనస్ పథకాన్ని ఎగవేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పక్కాప్లాన్ వేసిందా? పథకాన్ని ఒకేసారి ఎత్తివేయకుండా పరోక్షంగా కుదించేందుకు సిద్ధపడిందా? అందుకే మార్కెట్లో భారీ డిమాండ్ కలిగిన, కొనుగోలు కేంద్రాలకే రాని సన్నాలకు బోనస్ ప్రకటించిందా? 37 రకాలను 7 రకాలకు కుదించడం వెనుక కుట్ర ఇదేనా? కేంద్రాలకు రాలేదు కాబట్టి బోనస్ ఇవ్వడంలేదని ప్రకటించనున్నదా? అంటే అవుననే సమాధానాలు రైతులు, అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. సన్నధాన్యం బోనస్ పథకానికి క్రమంగా చరమగీతం పాడేందుకే కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కొనుగోలు కేంద్రాలకు రాని సన్నాలకు బోనస్ ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నదని అంటున్నారు. 37 రకాల సన్నాలను 7 రకాలకు తగ్గించడం వెనుక సర్కార్ భారీ కుట్ర దాగి ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
7 రకాల్లో కేంద్రాలకొచ్చేవి రెండే
సన్నధాన్యం బోనస్‌లో భాగంగా రెండేండ్ల క్రితం కాంగ్రెస్ సర్కార్ 37 రకాల సన్నాలను గుర్తించింది. వీటన్నింటికీ క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఉన్నపళంగా బోనస్ జాబితాలోని సన్నాల రకాలను 37 నుంచి 7 రకాలకు కుదించింది. వీటికి బహిరంగ మార్కెట్లోనే డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తారు. పచ్చి ధాన్యాన్నే మద్దతు ధరకు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తారు. తద్వారా రైతులకు ధాన్యం ఆరబెట్టడం, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తప్పుతుంది. ఈ ఏడు రకాల్లో ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం రకాలు 95శాతం ప్రైవేట్‌కు వెళ్తాయి. బీపీటీ-5204లో 60 శాతం వరకు ప్రైవేట్‌కు 40 శాతం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. కేఎన్ఎం-1638, కేఎన్ఎం-7715 రకాలు మాత్రమే అత్యధికంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అకావకాశం ఉంటుందని తెలిసింది. డబ్ల్యూజీఎల్-44 రకానికి సంబంధించిన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేవు. వీటిని సాగుచేసే అవకాశమే లేదు.
కేంద్రాలకొచ్చేది 10 లక్షల టన్నులే!
రాష్ట్రంలోని వ్యాపారులే కాకుండా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర వ్యాపారులు సైతం తెలంగాణ సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇలా ప్రతి వానకాలంలో సుమారు 40 లక్షల టన్నుల వరకు సన్నధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేస్తారు. రాష్ట్రంలో వానకాలంలో 60-70 లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇందులో 40-45 లక్షల టన్నులు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయగా, 15-20 లక్షల టన్నులను రైతులు తమ అవసరాలకు ఉంచుకుంటున్నారు. మిగిలిన 5-10 లక్షల టన్నులు మిగులుతాయి. ఈ లెక్కన ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నరకం ధాన్యం 10 లక్షల టన్నులకు మించబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలంలో ప్రభుత్వం 39.08 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు గానూ రూ.1,954.20 కోట్లు రైతులకు బోనస్ కింద చెల్లించింది. అయితే ఇప్పుడు ఇది 10 లక్షల్లోపునకే తగ్గే అవకాశం ఉన్నది. అంటే సర్కార్ బోనస్ చెల్లింపు రూ.500 కోట్లకు మించదు.
17 శాతానికే ఇంత రాద్ధాంతమా?
ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్నాలే రాష్ట్రంలో 83శాతం సాగవుతాయని, మిగిలిన 30 రకాల సన్నాలు కేవలం 17శాతంలోనే సాగవుతాయని ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో 83శాతం సాగయ్యే సన్నాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్.. 17శాతం సాగయ్యే సన్నాలను కొనుగోలు చేసేందుకు ఎందుకు వెనుకంజ వేస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 17శాతంలో సాగయ్యే పంటలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ సర్కార్ ఉన్నదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
బోనస్ రద్దుకే ఈ ఎత్తులు! జిత్తులు?
సన్నాలకు బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఆ భారాన్ని సర్కార్ మోయలేకపోతున్నదని తెలిసింది. ఏటా రెండు సీజన్లలో కలిపి కనీసంగా రూ.2వేల కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బోనస్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే తొలుత యాసంగి సీజన్లో బోనస్‌ను ఎగవేసిన సర్కార్.. ఇప్పుడు సన్న రకాలను 37 నుంచి 7రకాలకు తగ్గించిందనే విమర్శలున్నాయి. ఈ 7 రకాల్లో అత్యధిక ధాన్యం ప్రైవేట్ మార్కెట్‌కే తరులుతుంది అందుకే ప్రభుత్వంపై భారం పడబోదనే ఆలోచనలో పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే గత యాసంగి బోనస్ రూ.1,159 కోట్లు, ఈ యాసంగి బోనస్ రూ.700 కోట్లకు సర్కార్ ఎగనామం పెట్టినట్టే. ఇలా బోనస్ పథకాన్ని ఎగవేసేందుకు ఎత్తులు, జిత్తులు వేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

