హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింది. బ్రాహ్మణ పరిషత్‌కు విడుదల చేసిన నిధులను వెనక్కి లాగేసుకుంది. గత సంవత్సరం బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్‌కు రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. వాటిలో రూ.25 కోట్లను ఈ ఏడాది మార్చి చివరి వారంలో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ నిధులు బ్రాహ్మణ పరిషత్ ఖాతాలో పడినప్పటికీ తనకు అవసరం ఉన్నదంటూ రేవంత్‌రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకున్నది. దీంతో వివేకానంద విదేశీ విద్యా పథకం కింద విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు షాక్ తగిలింది. దీనిపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ నోటిదగ్గర కూడు లాగేశారంటూ మండిపడుతున్నాయి.
ఇప్పటికే తాము విదేశాల్లోని రెస్టారెంట్లలో పనిచేస్తూ ఎప్పటికైనా డబ్బులు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నామని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వం పరిషత్ ఖాతా నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం ఏమిటని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్‌కు రూ.100 కోట్లు కేటాయించినట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తొలి త్రైమాసికానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పేరిట బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవో రావలసి ఉందని, ఆ తర్వాత ఆ నిధులను ఎలా వినియోగించాలన్నదానిపై పరిషత్ నుంచి ప్రతిపాదనలు పెట్టించి టోకెన్ తీసుకున్నాక ఫైనాన్స్ క్లియరెన్స్‌కు పంపించాలని ఓ అధికారి చెప్పారు. అయితే ఈ నిధులను కూడా రేవంత్‌రెడ్డి సర్కారు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నదని, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మలేమని బ్రాహ్మణ సంఘాలు అంటున్నాయి.