మధిర, సెప్టెంబర్ 24 : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.34 కోట్లతో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మించారు. పాత దవాఖాన సరిపోక రోగులు ఇబ్బందులు పడుతుంటే.. అన్ని హంగులతో హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టారు. 2023 నవంబర్లో ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా దీన్ని అందుబాటులోకి తేలేకపోతున్నది. పెద్ద వ్యాధులు వచ్చిన రోగులు సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రధాన దవాఖానకు వెళ్లాల్సి వస్తున్నది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సొంత ఇలాకాలోనే ఓ దవాఖానను ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానను కడితే దీన్ని ప్రారంభించేందుకు ఇంత సమయం తీసుకోవడం వెనుక మర్మమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్కార్ తీరు, స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం భట్టి నిర్లక్ష్యంపై మధిర నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. దీన్ని ప్రారంభిస్తే కేసీఆర్ సర్కార్కు క్రెడిట్ వస్తుందన్న భావనతోనే వాయిదా వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా భట్టి చొరవ తీసుకొని ఈ దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.