హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వేకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచీ ఇష్టారీతినే వ్యవహరిస్తున్నది. ఇన్నాళ్లుగా కులాలవారీ గణాంకాలను గోప్యంగా పెట్టి, తాజాగా రాష్ర్టాల ఎన్నికల సమయంలో ఉన్నపళంగా బట్టబయలు చేసింది. ఈ గణాంకాల ఆధారంగానే డెడికేటెడ్ కమిషన్‌ను నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో ఇంటింటి (సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల) సర్వేను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తంగా 1.15 కుటుంబాలను గుర్తించి, 1.12 కోట్ల కుటుంబాలను సర్వే చేసింది. మొత్తం జనాభా 3.7కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1 శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్లు ప్రభుత్వం నివేదికను వెల్లడించింది. నాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలు స్థూలంగా మాత్రమే వెల్లడించింది. బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08శాతం, ఓసీ 15.79 శాతం, ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా ప్రకటించింది. అయితే ఆ గణాంకాలపై తీవ్ర వ్యతిరేకత, కులసంఘాల నుంచి అభ్యంతరాలు వెల్లడయ్యాయి. చివరికి 2025 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీసర్వేను ప్రభుత్వం నిర్వహించింది. అప్పటికీ అదనంగా మరో 2లక్షల మంది మాత్రమే సర్వేలో పాల్గొన్నారని తెలిపింది. అప్పుడూ పూర్తి నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. ‘డేటా ప్రైవసీ’ అంటూ దాటవేసింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలపై అపట్లోనే బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది.
2014 సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా.. 2011 జనాభా లెక్కలతో పోల్చినా ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు పూర్తిగా అసంబద్ధంగానే ఉన్నాయి. 2001-2011 జనాభా వృద్ధిరేటును అనుసరించి రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధిరేటు 1.35 శాతంగా నిర్ధారించారు. 2011-2024లో అంటే గడిచిన 13ఏండ్లలో రాష్ట్ర జనాభా 70లక్షలకు పైగా పెరగాలి. ఆ లెక్కన 2024నాటికి జనాభా 4.18 కోట్లుగా ఉండాలనేది ఒక అంచనా. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి. గడచిన 13ఏండ్ల కాలంలో అంటే 2011-2024 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 20,73,880 (5.07 శాతం)మంది మాత్రమే పెరిగారు. అంచనా వేసిన జనాభాలో దాదాపు 50లక్షల మంది తక్కువగా ఉన్నారు. ఇంత భారీ వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఇంటింటి సర్వే గణాంకాల ప్రకారం దశాబ్దకాలంలో పెరిగిన రాష్ట్ర జనాభా 2,01,000 మాత్రమే. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ ఏర్పాటు తరువాత 2014 నుంచి 2023 నాటికే 13.15లక్షల మందికి పెండ్లిళ్లు అయ్యాయి. ఈ ఏడాది కాలంలో ఆ సంఖ్య మరో లక్షకుపైగా ఉండింది. నికరంగా 14లక్షలకుపైగా పెండ్లిళ్లయ్యాయనేది కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారుల సంఖ్యనే. వారంతా బీపీఎల్ కుటుంబాలే. ఇవిగాకుండా రిజస్టర్, ఇతరత్రా అనధికారికంగా జరిగిన పెండ్లిళ్ల సంఖ్య కూడా అంతకు రెట్టింపు సంఖ్యలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే 2017జూన్ నుంచి 2023జూన్ మధ్య ఆరేండ్ల కాలంలోనే ప్రభుత్వ దవాఖానల్లో 14లక్షలకు పైగా ప్రసవాలు కాగా, ఆ మేరకు కేసీఆర్ కిట్లను అందజేశారు. అంటే ఆ మేరకు జనాభా కూడా పెరిగింది. కానీ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఇంటింటి సర్వే గణాంకాల్లోనూ ఆ సంఖ్య ప్రతిబింబించకపోవడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బీసీ జనాభా శాతంపై కూడా అంతా గందరగోళం నెలకొన్నది. జనాభాలో మొత్తంగా బీసీలు 1,64,09,179 మంది (46.25శాతం) గా ప్రభుత్వం వెల్లడించింది. అయితే బీసీ ముస్లింలు 35,76,588 మంది (10.08శాతం)గా వెల్లడించింది. రెండింటిని కలిపి బీసీ జనాభా 56.33శాతంగా ప్రభుత్వం లెక్కతేల్చింది. దీనిపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ ముస్లింలు కాకుండానే బీసీల జనాభా 51శాతానికి పైగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించడంపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ గణాంకాలపైనే సర్వత్రా గందగోళం నెలకొన్నది. ఎస్సీ జనాభా కేవలం 17.43శాతంగానే నిర్ధారించడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎస్సీవర్గాలు తమ జనాభా 20శాతానికి పెరిగి ఉంటుందని తెలుపుతుండగా, అందుకు భిన్నంగా రాష్ట్ర గణాంకాలు ఎస్సీ జనాభా తగ్గినట్లుగా చూపడం గమనార్హం.
సర్వే గణాంకాలను పూర్తిగా వెల్లడించకుండానే బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానికసంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామని చెబుతూ అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసింది. అప్పుడూ కూడా కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టలేదు. అటు తరువాత ఆర్డినెన్స్‌లను తీసుకువచ్చింది. ఇటీవల జీవోను కూడా జారీ చేసింది. కానీ నివేదికలను మాత్రం వెల్లడించలేదు. కమిషన్ ఏ ప్రాతిపదికగా సిఫార్సులు చేసిందనేది ఎవరికీ అంతుపట్టని విషయం. ఆ తరువాత బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ, కేంద్రంపై నెపం మోపుతూ బీసీల రిజర్వేషన్లను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే కుదించింది. గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ధారిస్తూ జీవో 46జారీ చేసింది. ఎన్నికలను నిర్వహించింది. తాజాగా అన్నీ అయిపోయాక కులాలవారీగా లెక్కలను వెల్లడించింది. అవి కూడా అసంబద్ధంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.