నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయవంతమైంది. ఈ పరిణామం మోదీకి ముందున్న రాజకీయ ఇబ్బందులకు సంకేతంగా కనబడుతున్నది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు రోజు కూడా మోదీ ధీమాగానే ఉన్నారు. తన పన్నెండేండ్ల పాలనలో జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమం తన ప్రభుత్వాన్ని ఏమాత్రం కదిలించలేదని అనుకున్నారు. అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. యువ మిత్రులను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలోచనాత్మక సూచనలకు ధన్యవాదాలు చెప్పారు. కానీ 24 గంటలు గడువకముందే ప్రజల ఒత్తిడికి తలొగ్గి మంత్రితో రాజీనామా చేయించారు.
2014 నుంచి నరేంద్ర మోదీ ఎవరికీ జవాబుదారీగా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం ఆయన ప్రభుత్వానికి అరుదైన ఎదురుదెబ్బ. నీట్ ప్రశ్నాపత్రం లీక్, 20 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం, పది మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో యువతలో ఆగ్రహం పెల్లుబికింది. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన జెన్-జీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరసనలు చేపట్టారు. మోదీకి అత్యంత సన్నిహిత రాజకీయ మిత్రుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధాన డిమాండ్‌గా వినిపించారు. కానీ విద్యార్థులను ఉద్దేశించి మోదీ చేసిన మొదటి సెల్ఫీ వీడియోలో ఎక్కడా కూడా ధర్మేంద్ర ప్రధాన్ పేరును ప్రస్తావించలేదు. కానీ మోదీ వీడియో విడుదల చేసిన మరుసటి రోజే జంతర్ మంతర్‌కు పెద్దఎత్తున విద్యార్థులు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని నగరాల్లోనూ ఉద్యమం వేగంగా విస్తరించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ చర్చలపై ఆధిపత్యం సాధించడంలో అత్యంత సమర్థంగా వ్యవహరించింది. ఇందుకోసం బలమైన, వ్యవస్థీకృతమైన ఐటీ విభాగాన్ని వినియోగించింది. ప్రజలు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఎవరి నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చినా ఎదురుదాడితో ప్రతిఘటించింది. కానీ జెన్-జీ యువత రూపొందించిన లక్షలాది మీమ్స్, రీల్స్ ముందు బీజేపీ వ్యూహం నిలబడలేకపోయింది.
మోదీని నిర్భయంగా విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎద్దేవా చేస్తూ, ఒక పోస్టును మించి మరో పోస్టు సృజనాత్మకంగా, ఘాటుగా సంధించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతతో నేరుగా మాట్లాడేందుకు మోదీ చేసిన చివరి ప్రయత్నం కూడా మరింత ఎగతాళికి, కొత్త మీమ్స్‌కు దారితీశాయి తప్ప, ఏమాత్రం సానుకూలంగా ఉపయోగపడలేదు.
మోదీ ప్రభుత్వం ప్రధాన స్రవంతి మీడియాను తమ ఆధీనంలోకి తీసుకున్నది. బీజేపీ అనుకూల, హిందుత్వ వాద భావజాలాన్ని వార్తా చానెళ్లు ప్రచారం చేస్తూ వచ్చాయి. మోదీ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడంలో అనుకూల మీడియా కీలక పాత్ర పోషించింది. కానీ ఈ సారి ఆ వేదికల ప్రయత్నాలు ఫలించలేదు. విద్యార్థుల నిరసనలను మొదట పట్టించుకోలేదు. తర్వాత ప్రసారం చేసినప్పుడు కూడా ఈ ఉద్యమానికి విదేశీ శక్తులు, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు ఆర్థిక సాయం చేస్తున్నాయని సంకేతాలు ఇచ్చేలా కథనాలను ప్రసారం చేశాయి. మీడియా చానళ్ల ప్రసారాలను, ప్రచారాన్ని, అబద్ధాలను నిరసనకారులు సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టారు. నిరసనలు ఉధృతమైన తర్వాత కూడా మోదీ ఎక్కడ కూడా టీవీ ప్రసారాల్లో కనిపించలేదు. ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి మోదీ చేసిన ప్రయత్నాలు అన్నీ ముగిసిన తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకతప్పలేదు.
కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థులు, యువత పిలుపునిచ్చిన చలో పార్లమెంట్‌కు విశేష స్పందన లభించింది. పెద్దఎత్తున జనం తరలివచ్చారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులు ప్రయోగించిన హింసపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కఠినమైన అణచివేత చర్యలకు దిగే అవకాశాలు కూడా ప్రభుత్వానికి సాధ్యం కాదని తేలిపోయింది. ఆన్లైన్ వేదికలు పూర్తిగా నిరసనకారుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా విశ్వసనీయతను కోల్పోయిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రజల్లో ఆగ్రహం విస్తృతంగా వ్యాపించడంతోనే ప్రధాన్‌తో రాజీనామా చేయించడం తప్ప మోదీకి మరో మార్గం మిగల్లేదు.
మోదీ ప్రభుత్వం ప్రజల విధేయతను మాత్రమే కోరుకుంటుంది, విమర్శనాత్మక చర్చలను సహించదు, భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది, కానీ ఇప్పుడు ఆ భయానక వాతావరణం కుప్పకూలింది. అని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామంతో మోదీ తన మంత్రివర్గంపై నియంత్రణ కోల్పోయే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు. మోదీకి అత్యంత విధేయులైన మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు. పార్టీలోని సీనియర్ నాయకత్వం కోరుకున్న విధంగానే ఆయన విధానాలు అమలు చేశారని చెప్తుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ తొలి విజయానికి ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారని అంటుంటారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించడంలో విఫలమైంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మిత్రపక్షాల మద్దతు కూడగట్టాల్సి వచ్చింది. ఇటీవల పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో సానుకూల ఫలితాలతో మోదీ రాజకీయంగా బలపడ్డారు. బీజేపీ కోలుకున్నట్టు కనిపించింది. హిందూ జాతీయవాద రాజకీయాలను వ్యతిరేకించే బెంగాల్లోనూ బీజేపీ తొలిసారి గెలుపొందింది. రాజకీయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంలో పాగా వేసింది. మరోవైపు రాష్ర్టాల ఎన్నికల్లో వరుసగా పరాజయాలు చవిచూస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడి అధికారంలోకి వచ్చిందన్న కాంగ్రెస్ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. అయితే కాక్రోచ్ ఉద్యమ ఆవిర్భావంతో భారత యువతలోనే కాకుండా ప్రతిపక్ష పార్టీల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. జెన్-జీ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది.
వచ్చే ఏడాది పలు కీలకమైన రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సీజేపీ ఉద్యమం, ప్రజల్లో ఆగ్రహావేశాల నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోననే ఉత్కంఠ నెలకొన్నది. బీజేపీకి కంచుకోట వంటి ఉత్తరప్రదేశ్‌లో అధికారం నెలబెట్టుకోవడం ఆ పార్టీకి అత్యంత కీలకం. అక్కడి ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికలపైనా గణనీయమైన ప్రభావం చూపే అవకాశమున్నది. ఇటీవల యువత రాజకీయ చైతన్యం పొందింది. హక్కుల కోసం గొంతెత్తుతున్నది. విద్యాసంస్కరణల కోసం తాము చేసే పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని సీజేపీ నాయకులు, మద్దతుదారులు చెప్తున్నారు. మంత్రి రాజీనామా భవిష్యత్తు రాజకీయాల్లో మోదీ రాజకీయ పతనానికి సంకేతమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. యువతలోని ఆగ్రహం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
(వ్యాసకర్త: ది గార్డియన్ దక్షిణాసియా ప్రతినిధి)(ది గార్డియన్ సౌజన్యంతో)
-హన్నా ఎలీస్ పీటర్సన్