పరస్పర విరుద్ధమైనవి కొన్ని కాకతాళీయంగా ఒకే సమయంలో జరిగి మనకు నవ్వు తెప్పిస్తాయి. అటువంటిది ఒకటి జూలై 26న జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ రోజున హైదరాబాద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే కొత్త నినాదాన్ని భారతదేశానికి ఇచ్చారు. ఇందులో ‘జై యువ’ అన్నది ఆకర్షణీయంగా తోచిన కొత్త మాట అయినందున, అదేరోజు తెలంగాణ యువజనులకు సంబంధించి వచ్చిన వేరే రెండు వార్తలు కూడా ఆకర్షణీయంగా తోచాయి. ఒకటి, ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ ప్రకటన. రెండు, రాష్ట్రంలో 23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై తెలంగాణ కాక్రోచ్లు ఢిల్లీలో ప్రశ్నించటం.
జంతర్‌మంతర్‌కు చెవి పెట్టి విన్నట్లయితే కాక్రోచ్లు ఇదే అవగాహనతో మాట్లాడుతున్నట్లు రాజకీయ జాతికంతా స్పష్టమవుతుంది. జూలై 26న ఒకవైపు ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకునేందుకు రేవంత్‌రెడ్డి ‘జై యువ’ అంటూ నినాదాలు ఇస్తుండగా, అది ఎంత కపటపూరితమైనదో అదే రోజున రాష్ర్టానికి చెందిన యువతరం హైదరాబాద్‌లో, ఢిల్లీలో కూడా బహిరంగపరచింది.
చర్చలోకి పోయే ముందు ఈ ముగ్గురిలో ఎవరేమన్నారో చూద్దాము. సీఎం అన్నది వార్తల్లో యథాతథంగా ఈ విధంగా ఉంది: ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితిని 26 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. యువశక్తే దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇపుడు ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ విషయం చూద్దాము. రేవంత్‌రెడ్డి నీట్ పరీక్షలు, కాక్రోచ్ ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తుండటం తెలిసిందే. ఆయన 26న ‘జై యువ’ అన్న సందర్భంలోనూ ఈ పరీక్షల మాట వచ్చింది. సరిగా అదే రోజున, తెలంగాణ యువజనులతో కూడిన పోలీస్, నిరుద్యోగ జేఏసీ నాయకులు, కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో, ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాక్రోచ్ అనే మాటకు ప్రేరేపణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవమానకర వ్యాఖ్యలని తెలిసిందే. మరి ఈ ‘ఎండ్రిన్’ అన్న ప్రేరేపణ ఏమిటి? ప్రధాన న్యాయమూర్తి వలెనే బాధ్యతాయుత స్థానంలో గల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. జరిగిందేమిటో తెలుసుకుందాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘అభయహస్తం మేనిఫెస్టో’లో అనుబంధ మేనిఫెస్టో ఒకటి ఉంది. దానిని ‘ఉద్యోగ నియామకాల ప్రణాళిక’ (జాబ్ కేలండర్) అన్నారు. ఆ రెండు పేజీల ప్రణాళికలోని 8వ అంశం ‘ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర యూని ఫామ్ సిబ్బంది’ నియామకాలకు సంబంధించినది. ఆ నియామకాలను 20 24 మార్చి 1న మొదటిదశగా, 2024 డిసెంబర్ 1న రెండవ దశగా చేపట్టగలమని ప్రకటించారు.
ఇపుడు 2026 జూలై చివరలో (ఎండ్రిన్ పార్టీ ప్రకటన సమయం) ఉన్నాము. ఈ ఖాళీలు సుమారు 20 వేలు ఉన్నట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తులో ప్రభుత్వమే సూచించింది. ఆ ప్రకారం అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని యువతీ యువకులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న తమ సోదరసోదరీ పోలీస్‌ల నుంచి ఈడ్చివేతలకు గురై లాఠీదెబ్బలు కూడా తిన్నారు. చివరకు ప్రభుత్వం 5వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని మొదట ప్రకటించి, ఎండ్రిన్ పార్టీ హెచ్చరిక తర్వాత 7,400కు పెంచింది.
దానిపై ‘జై యువ’ నిరసనలు మొదలుపెట్టింది. అందుకు ‘జై యువ’ స్ఫూర్తితో స్పందించిన ముఖ్యమంత్రి, ‘మీరు ఒర్లినా, పొర్లు దండాలు పెట్టినా, ఎండ్రిన్ తాగి బాయిల దుంకినా పోలీస్ ఉద్యోగాలు పెంచలే’మని తనదైన శైలిలో నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఎండ్రిన్ పార్టీ’ ప్రేరణ ఇక్కడ ఉందన్నమాట. పార్టీ ఏర్పాటు ఉద్దేశాన్ని 26న ప్రకటించిన ‘జై యువ’ ఒక ప్రకటనలో, ఎండ్రిన్ తాగి చావండి అన్న నోర్లే రేపు నిరుద్యోగుల సత్తా చూసి నోరెళ్లబెడతాయన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారంలో పూర్తిచేసి అధికారికంగా ప్రకటిస్తామని, తర్వాత సూర్యాపేటలో మొదటి బహిరంగ సభ నిర్వహించగలమని అన్నారు. ఇది ఏ విధంగా పరిణమించగలదన్నది అట్లుంచి, వారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల గురించి కూడా ముఖ్యమంత్రికి గుర్తుచేయటం గమనించదగ్గది. 26న ‘జై యువ’ నినాదం ఇచ్చిన మరునాడు రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాకతాళీయంగా అదే 26న ఢిల్లీలో తెలంగాణ ‘జై యువ’ కొందరు మీడియాతో మాట్లాడారు. వారు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి వెళ్లినవారు. వారు కాక్రోచ్ పార్టీ లేవనెత్తిన అంశాల గురించి మాట్లాడటంతోపాటు, తెలంగాణలో 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయగలమన్న ముఖ్యమంత్రి ప్రకటన గురించి, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన నీట్ విద్యార్థిని బాధితురాలైనా పట్టించుకోకపోవటాన్ని ప్రశ్నించారు. ఇవి రెండూ ‘జై యువ’కు సంబంధించిన అంశాలు కావటం గమనించదగ్గది.
ఈ రెండు వార్తలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందీ లేనిదీ తెలియదు గాని, మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ఆయన నినాదంలోని ‘జై జవాన్, జై కిసాన్’ భాగంలో జై కిసాన్ అన్నది మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ఇచ్చిందనేది తెలిసిందే. దానిని రేవంత్ కాపీ చేశారనటం లేదు. కాని, ‘జై యువ’కు సంబంధించి యువకుల భావనలు ఏమిటో పైన చూశాము గనుక, ‘జై కిసాన్’ విషయంలో తెలంగాణ రైతులు రేవంత్‌రెడ్డి పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం అదే 26న కూడా పత్రికా కథనాలుగా వెలువడటాన్ని గుర్తుచేసుకోవటం అవసరం. ఆయన వారితోనూ ఎండ్రిన్ తాగినా సాగునీళ్లివ్వలేను, ఎరు
వులివ్వలేను, రైతుబంధు ఇవ్వలేను, రైతు బీమా ఇవ్వలేను, బోనస్ ఇవ్వలేను, పంటలు కొనలేను, కరెంట్ కోతలు ఆపలేను వగైరా మాటలు అంటారేమో తెలియదు.
తిరిగి మొదటికి వస్తే, ఇంతకూ యువతరంపైన రేవంత్‌రెడ్డికి ఇంతటి ప్రేమ ఎందుకు కలిగి ఉంటుంది? అందరికీ అర్థమవుతున్నదే గనుక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌ను పురస్కరించుకుని యువతీ యువకులు అనూహ్యమైన రీతిలో బీజేపీ ప్రభుత్వంపై నిరసనలు తెలుపుతున్నారు గనుక, ఆ స్థితిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో అంతే పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించింది.
అదే పని చేయవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్‌లకు ఆదేశాలు వెళ్లాయి. కనుక రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్‌రెడ్డి వరకు శక్తివంచన లేకుండా ఆందోళనల మార్గం పట్టారని ఇండియాలో, తెలంగాణలోనే గాక ప్రపంచమంతటా మాట్లాడుతున్నారు. ఇది కల్పించి చెప్తున్నమాట అనుకునేవారు అంతర్జాతీయ పత్రికలను, చానళ్లను తామే చూడవచ్చు. ఇట్లా అంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాక్రోచ్లకు మద్దతు వద్దని కాదు, కాని ఆ పని చేస్తూనే ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలన్నది ఉద్దేశం.
ఈ మాట ‘జై యువ’ కూడా అంటున్నట్లు పార్టీ వారు గుర్తించాలి. కాక్రోచ్లు స్పష్టంగా ఎత్తిచూపుతున్నవి కొన్నున్నాయి. ప్రస్తుతం నీట్ పేపర్ బీజేపీ హయాంలో లీక్ అయినా, కాంగ్రెస్ పాలనలోనూ ఇది జరిగింది. అంతేకాదు. దేశంలో విద్యా విధానాలు లోపభూయిష్టం కావటం వల్ల మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టడం ఎప్పుడో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. విద్యను విస్తృతంగా ప్రైవేట్‌పరం చేసి వ్యాపారంగా మార్చటం, ప్రభుత్వ విద్యను బలహీనపరచటం, మంచి చదువులు సంపన్నుల పిల్లలకు అందుబాటులోకి రా గా, సాధారణ కుటుంబాలకు చెందిన ‘జై యువ’ అధ్వానపు చదువులతో వీధుల పాలవుతుండటం, టీచర్ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భర్తీ కాకపోవటం, ఉన్నవారికి శిక్షణలు, నైపుణ్యాలు లోపించటం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు సైతం కనీస వసతులు లేకపోవటం, సమయానికి పాఠ్యపుస్తకాలు అందకపోవటం, తరగతి గదుల కొరత, విద్యను ఆధునీకరించకపోవటం, సరైన శిక్షణ లోపం, పరీక్షల ఒత్తిడిని సృష్టించి పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి, కోచింగ్ కంపెనీల పేరిట జరుగుతున్న దారుణాలు, పరీక్ష పేపర్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగటం, దోషులను ఏవో సాకులతో వదలివేయటం వంటి ధోరణులు ఎప్పుడు మొదలై ఎట్లా కొనసాగుతున్నాయో ‘జై యువ’కు కూలంకశంగా తెలియజేయవలసిన, ఆ లోపాలను తొలగించవలసిన బాధ్యత ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై ఎంతున్నదో, లోగడ పాలించిన కాంగ్రెస్‌పై కూడా అంతున్నది.
జంతర్‌మంతర్‌కు చెవి పెట్టి విన్నట్లయితే కాక్రోచ్లు ఇదే అవగాహనతో మాట్లాడుతున్నట్లు రాజకీయ జాతికంతా స్పష్టమవుతుంది. జూలై 26న ఒకవైపు ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకునేందుకు రేవంత్‌రెడ్డి ‘జై యువ’ అంటూ నినాదాలు ఇస్తుండగా, అది ఎంత కపటపూరితమైనదో అదే రోజున రాష్ర్టానికి చెందిన యువతరం హైదరాబాద్‌లో, ఢిల్లీలో కూడా బహిరంగపరచింది. జంతర్‌మంతర్ వద్దనే గాక, అది కేంద్రంగా దేశమంతటా వ్యాపించిన తీవ్ర ప్రకంపనలు యువతరం భ్రమలకు లోనయ్యే దశ గడిచిపోయినట్లు చెప్తున్నాయి. అనేక దశాబ్దాల స్వతంత్ర భారతంలో నాల్గోతరం ప్రవేశించేసరికి అవగాహనలు, చైతన్యాలు లోగడ ఎన్నడూ లేని స్థాయి లో కనిపిస్తున్నాయి. వీరి ధిక్కారం, చొరవ, శక్త్యుత్సాహాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసి మొత్తం దేశంతోపాటు ప్రపంచమే ఆశ్చర్యపోయి చప్పట్లు చరిచింది. అందువల్ల రేవంత్‌రెడ్డి వంటివారు పనికిరాని, ఎవరూ విలువ ఇవ్వని కపటపు నినాదాలనివ్వటం మానివేసి, యువతరం కోరుతున్నట్లు విద్యారంగం గురిం చి సమగ్రమైన సమీక్షలు సీరియస్‌గా జరపటం, అవసరమైన మార్పులను పట్టుదలగా అమలుపరచటం మంచిది.
-టంకశాల అశోక్