రంగారెడ్డి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని పచ్చని పొలాలపై ప్రభుత్వం కన్నేసింది. పారిశ్రామిక అవసరాల పేరుతో వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు స్కెచ్ వేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో అధికారులు తమ తెలియకుండా పట్టా భూముల్లో డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తుండటంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ వల్ల ఎక్వాయిపల్లిలో రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతుండగా, తాజాగా మరో భూసేకరణ పిడుగు పడటం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రంగారెడ్డి జిల్లా కడ్తార్ మండలం ముద్విన్ రెవెన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో 620 ఎకరాల అసైన్డ్ భూములతో పాటు వీటి పక్కనే ఉన్న మరో 400 ఎకరాల పట్టా భూములను కూడా సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.
రైతులకు తెలియకుండానే పట్టా భూముల కోసం డ్రోన్ కెమెరాలతో అధికారులు సర్వే చేశారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ వల్ల పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్నారు. ఈ రోడ్డు పక్కనే పారిశ్రామిక ప్రగతి పేరుతో మరో వెయ్యి ఎకరాలను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రభుత్వం ఇప్పటికే కడ్తాల్ తహసీల్దార్ నుంచి సంబంధిత భూముల సర్వే మ్యాప్‌లను తెప్పించుకున్నట్టు తెలిసింది. ఈ భూములపై త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీచేసే అవకాశాలున్నాయి. భూసేకరణ జరుపుతారన్న సమాచారంతో కొద్దిరోజులుగా ఎక్వాయిపల్లి, ముద్విన్ గ్రామాల్లో రైతులను కలవరపెడుతున్నది. తమ పట్టా భూములను తీసుకోవద్దంటూ ఇప్పటికే బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. అయినా ప్రభుత్వం మాత్రం భూసేకరణ వైపే మొగ్గు చూపుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతున్నది. హైదరాబాద్ శివారులో ఉన్న జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, ఆమనగల్లు, షాద్‌నగర్, షాబాద్, మొయినాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర మండలాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున సేకరించింది. ముఖ్యంగా భారత్ ఫ్యూచర్‌సిటీ పేరు తో ఈ మండలాల్లో ఉన్న అసైన్డ్ భూముల జా బితాను తహసీల్దార్ల ద్వారా తెప్పించుకొన్న ప్ర భుత్వం.. వాటి పక్కనే ఉన్న పట్టా భూములకూ ఎసరు పెడుతున్నది. ఇప్పటికే యాచా రం మండలం మొండిగౌరెల్లిలో 680 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 600 ఎకరాలు, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలంలోని తి మ్మాపూర్, జబ్బార్‌గూడ, మీర్ఖాన్పేట్, బేగరికంచె, ముచ్చర్ల, యాచారం మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో భూసేకరణ ద్వారా అసైన్డ్ భూములను స్వాధీ నం చేసుకున్నది. తాజాగా ఎక్వాయిపల్లిలో వెయ్యి ఎకరాల భూసేకరణకు సిద్ధమైంది.