Rithu Chowdary | బిగ్‌బాస్ వేదికగా పరిచయమై.. ఆ తర్వాత బయట కూడా మంచి స్నేహితులుగా కొనసాగిన డీమాన్ పవన్, రీతూ చౌదరి జంటకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. కలిసి ఓ పాట కూడా చేయగా, దానికి యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డీమాన్ పవన్ చేసిన ఓ ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్‌తో వీరి స్నేహంలో విభేదాలు వచ్చిన విషయం బయటకు వచ్చింది.
డీమాన్ పవన్ ఇటీవల సోషల్ మీడియాలో సుదీర్ఘమైన భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తమ మధ్య స్నేహం ముగిసిందని, ఇకపై ఎవరి దారి వారిదేనని పేర్కొన్నారు. తాము ఒకరినొకరు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బ్లాక్ చేసుకున్నామని కూడా తెలిపారు. అదే సమయంలో తమ మధ్య ఎవరూ ఎవరినీ ఉపయోగించుకోలేదని స్పష్టం చేశారు. పవన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి అభిమానుల్లో చర్చ మొదలైంది. వీరి స్నేహం ముగియడానికి అసలు కారణం ఏమిటనే దానిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు కూడా వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వ్యవహారంపై రీతూ చౌదరిని నెటిజన్లు, మీడియా ప్రశ్నించడంతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. పవన్‌తో తనది కేవలం స్నేహం మాత్రమేనని, దాన్ని బ్రేకప్ అంటూ ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ‘మేమేమైనా లవర్సా? పెళ్లి చేసుకున్నామా? బ్రేకప్ అని చెప్పుకోవడానికి! మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. ఏదో పెద్ద బ్రేకప్ జరిగినట్లు అందరూ ఇంత రచ్చ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్‌తో మీకు గొడవలు రావా? ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే’’ అంటూ రీతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పవన్ ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దానిపై నెటిజన్లు ఇంతగా స్పందించడం తనకు ఆశ్చర్యంగా ఉందనే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం కారణంగా తనకు ఒక్కరోజులోనే 25 వేల మంది ఫాలోవర్స్ పెరిగారని కూడా రీతూ పేర్కొన్నారు.