Warangal | హనుమకొండ, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలును పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకంలో మాత్రం పట్టుదలతో ఉంటున్నది. పేదల భూములను లాక్కోవడంతోపాటు ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రాధాన్యం ఇస్తున్నది.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో రూ.100 కోట్ల విలువైన భూముల అమ్మకానికి మరోసారి ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ బస్‌స్టాండ్‌కు అతి దగ్గరలోని అత్యంత విలువైన భూములను అమ్మకం పేరుతో కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే బంధువులకు కట్టబెట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఆరు నెలల క్రితం ప్రయత్నించి.. ప్రజల నిరసనలు, వరదలతో కాస్త వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కచ్చితంగా భూములను విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమకొండ బస్‌స్టాండు సమీపంలోని 2 ఎకరాల 27 గుంటల భూమిని బహిరంగ వేలంలో విక్రయించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) గత అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది.
నవంబర్ 3న బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ప్రకటనలు జారీ చేసింది. అప్పుడే, వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చి వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు తాత్కాలిక సాయం ప్రకటించి వెళ్లారు. వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉండటం.. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నిరసనతో భూముల అమ్మకాన్ని వాయిదా వేస్తున్నట్టు ‘కుడా’ ప్రకటించింది. ఆరు నెలలు కావడంతో అప్పటి పరిస్థితిని మరిచిపోయారని ప్రభుత్వం భావిస్తున్నది.
అభివృద్ధికి నిధుల సమీకరణ పేరుతో రూ.100 కోట్ల విలువైన 2 ఎకరాల 27 గుంటల భూమిని విక్రయించేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నది. భూముల అమ్మకం కొత్త కాకపోయినా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో ఎప్పుడూ లేని ప్రక్రియను అమలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘కుడా’ ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో భూములను సేకరించింది, విక్రయించింది. ప్రభుత్వ భూములను, ప్రైవేటు వ్యక్తుల భూములను సేకరించి ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేసి బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహించింది. ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ‘కుడా’ భారీగానే ఆదాయం సమకూర్చుకున్నది. వరంగల్ నగరంలోని చాలా ప్రాంతాల్లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంచర్లు చేసింది. ఇప్పుడు ‘కుడా’ పరిధిలోని అత్యంత ఖరీదైన భూమిని విక్రయించే ప్రక్రియ కొత్తగా ఉంటుండటంతో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండ్లు లేదా వాణిజ్య స్థలాలుగా అభివృద్ధి చేసి విక్రయించకుండా గుంపగుత్తగా ఎకరాల లెక్కన బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత విలువైన భూమిని ఎవరో ఒకరికి ముందుగానే నిర్ణయించి ఇచ్చేందుకే ఎకరాల చొప్పున వేలం వేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఇండ్లు లేదా వాణిజ్య స్థలాలుగా అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది పోటీపడి ఎక్కువ ఆదాయం వస్తుందని, ఎకరాల చొప్పున అయితే నామమాత్రపు పోటీతో ప్రభుత్వం అనుకున్న వారికే భూములు దక్కుతాయనే చర్చ జరుగుతున్నది. ఆరు నెలల క్రితం ఇదే విమర్శలు, నిరసనలతో భూముల బహిరంగ వేలం ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ’కుడా’ ప్రకటించింది. ఎన్ని విమర్శలు, నిరసనలు వచ్చినా ఇప్పుడు మళ్లీ అదే రకంగా ముందుకు సాగుతున్నది.
వరంగల్ నగరంలోని హనుమకొండ బస్‌స్టాండ్ సమీపంలో ఎక్కువగా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. 1855లో నిజాం ప్రభుత్వం రికార్డుల ప్రకారం.. ప్రస్తుత స్పోర్ట్స్ హాస్టల్ వెనుకవైపు దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూములు రెవెన్యూ శాఖ నుంచి మున్సిపల్ శాఖకు బదిలీ అయ్యాయి. ఆ తర్వాత వరంగల్ మున్సిపాలిటీ వీటిని ‘కుడా’కు బదలాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల్లోనే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించింది. కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం కోసం 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 2.27 ఎకరాలను ఎంపిక చేసింది. కాళోజీ కళా క్షేత్రం పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆ తర్వాత ప్రధాన రహదారి పక్కన ఉన్న భూమిలోకి నిర్మించింది. కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం కోసం ముందుగా ఎంపిక చేసిన 2.27 ఎకరాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. హనుమకొండ బస్‌స్టాండ్ నుంచి హైదరాబాద్ రోడ్డుకు అనుబంధంగా 200 మీటర్ల దూరంలోని ఈ భూమికి 50 ఫీట్ల రోడ్డు వసతి ఉన్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రహరీ కట్టి గేటు పెట్టించింది. కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం ప్రతిపాదన తర్వాత ఈ స్థలం నివాస క్యాటగిరీలో ఉన్నదా? వాణిజ్య విభాగంలోనా అనేది స్పష్టత లేదు. కమర్షియల్ క్యాటగిరీలో ఉంటేనే విలువైన ఈ భూమికి పోటీ ఉండి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వాణిజ్య విభాగానికి మార్చకుండా వేలం ప్రక్రియ నిర్వహించాలని ‘కుడా’ ఏర్పాట్లు చేస్తుండటంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల బంధువుల కోసమే ఇలా చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.