(నూర శ్రీనివాస్)వరంగల్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను గమనిస్తే ఎవరికైనా ఈ విషయం సులభంగా అర్థం అవుతుంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడాన్ని ఓర్చుకోలేకపోతున్నది. పాలనా లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, చర్చకు పెడుతుంటే, ప్రజలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నది. ముఖ్యమంత్రి మొదలు ఆయన పరివారం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల వరకు భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు అంశాల వారీగా ఆరోపిస్తున్నారు.
చట్టసభల్లో, ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్నది. బీఆర్ఎస్ గొంతునొక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. తమది ప్రజాస్వామ్యమని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ‘బెదిరింపుస్వామ్యాన్ని’ ఆశ్రయించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకునే ప్రభుత్వం తన మీద ఉన్న ప్రజావ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అడ్డగోలు ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలను పసలేని కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నది. కమిటీలు, కమిషన్ల పేరుతో తరుచూ విచారణలకు పిలుస్తూ వేధింపులకు గురిచేస్తున్నది. గడిచిన రెండున్నరేండ్లలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు మన్నె క్రిశాంక్ సహా అనేక మందిపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. నాయకులే కాదు కార్యకర్తలనూ వదలడం లేదు. చివరికి ప్రశ్నించే జర్నలిస్టులపైనా కక్ష పెంచుకున్నది. కొందరిని కక్షగట్టి జైలుకు పంపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలా రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపుతూ పాలన సాగిస్తున్నది.
విచారణల పేరుతో కేసీఆర్‌పై..
కేసీఆర్‌పై పల్లెత్తుమాట అంటే తెలంగాణ సమాజం దిగ్గున లేస్తుందని రెండున్నరేండ్లుగా ప్రతి సందర్భంలోనూ రేవంత్ సర్కార్‌కు అనుభవంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని నేరుగా ఎలాంటి చర్యలకు పాల్పడినా అనూహ్య పరిణామాలు ఉంటాయని అర్థమైంది. ఈ నేపథ్యంలో విచారణల పేరుతో వేధింపుల పర్వానికి తెరలేపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిన ఘటనను సాకుగా చూపుతూ విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియమించింది. 2024 మార్చి 10న కమిషన్‌ను నియమించగా 15 నెలలపాటు విచారణ జరిపింది. కేసీఆర్‌ను సాక్షిగా పిలిచి, విచారణ జరిపి, చివరికి కేసీఆర్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ నివేదిక సమర్పించింది. కమిషన్ చర్యను హైకోర్టు తప్పుబట్టి, నివేదికను పక్కన పెట్టిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాదు.. కేసీఆర్‌ను వేధించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ నోటీసులు ఇవ్వగా, కేసీఆర్ దానిని న్యాయపరంగా సవాల్ చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరుగలేదని ఆధారాలను బయటపెట్టడంతో జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగలేదు. మరో కమిషన్‌ను నియమించి, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరింది.
టార్గెట్ కేటీఆర్.. హరీశ్‌రావు
ప్రభుత్వ అసమర్థత, పాలనా లోపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నది. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ పార్టీని చెల్లాచెదురు చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగమే తొలిదశలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ తరువాత కేటీఆర్, హరీశ్‌రావు టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి పాచికవేయడం ప్రారంభించారని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఓటుకు నోటు కేసు’లో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా కేసీఆర్ కుటుంబంపై పథకం ప్రకారం కేసులు నమోదు అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేటీఆర్, హరీశ్‌రావు జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.
అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు తమ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. హామీల అమల్లో వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రభుత్వ పెద్దలు, వారి కుటుంబీకులు, అనుచరుల అవినీతి బాగోతాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, అమృత్ టెండర్లు, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఫార్మా విలేజ్ పేరుతో భూదందాలు, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్‌సిటీ పేరుతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆధారాలు సహా ప్రజల ముందు పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరినీ లక్ష్యంగా చేసుకొని పసలేని కేసులు నమోదు చేస్తున్నారు.
ఫార్ములా-ఈ: 2023లో ఫార్ములా ఈ-రేసుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. రేవంత్ సర్కార్ కొలువుదీరిన కొద్దిరోజులకే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా-ఈ నిర్వాహకులకు రూ.45 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసింది. అది పసలేని కేసు అని కేటీఆర్ మొదటి నుంచీ చెప్తూనే ఉన్నారు. దీనికి తగ్గట్టే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన ప్రతిసారీ అటెన్షన్ డైవర్షన్ కోసం ఫార్ములా ఈ-రేస్ కేసును ప్రభుత్వం తెరమీదికి తెస్తున్నది.కాళేశ్వరం కమిషన్: మేడిగడ్డ బరాజ్‌లోని 85 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లకు పర్రెలు రావడాన్ని బూచిగా చూపి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ 2024 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించాల్సింది పోయి.. కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావును ఇబ్బంది పెట్టేందుకే ఈ కమిషన్‌ను నియమించారనే ఆరోపణలు మొదటినుంచీ ఉన్నాయి. దీనికి తగట్టే కమిషన్ నివేదిక న్యాయస్థానంలో నిలుబడలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేస్తూనే ఉన్నది.
ఫోన్ ట్యాపింగ్ కేసు: రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నదని చెప్పేందుకు అనేక దాఖలాలున్నాయి. అందులో భాగమే ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు, విచారణకు సిట్ ఏర్పాటు. తమ పాలనపై ప్రజావ్యతిరేక పెల్లుబికుతున్న ప్రతిసారీ రేవంత్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్ కేసును తిరగదోడుతూ కాలక్షేపం చేస్తున్నది. కేటీఆర్, హరీశ్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేయగా, వారు హాజరైన సంగతి తెలిసిందే. వీరీతోపాటు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ సైతం సిట్ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కొన్నారు.
సింగరేణి కుంభకోణం: సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరతీసిందని హరీశ్‌రావు ఆధారాలు సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిన సర్కార్ ఉల్టా బీఆర్ఎస్ హయాంలోనే అవినీతి జరిగిందని ఎదురుదాడికి సిద్ధపడింది. దీంతో సింగరేణిలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ చేయాలని కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం నాటి రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్వర్మను కోరిన విషయం తెలిసిందే.
జన్వాడ ఫామ్ హౌస్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కాంగ్రెస్ జన్వాడ ఫామ్‌హౌస్‌పై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. 2024 ఆగస్టులో ఇరిగేషన్ అధికారులతో కొలతలు వేయించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదంటూ హడావుడి చేసింది. ‘కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కూల్చివేతలు’ అంటూ మీడియాకు లీకులు ఇచ్చి పతాకశీర్షికల్లో వార్తలను అచ్చేయించింది. అయితే, ఆ ఫామ్‌హౌస్ తనది కాదని, తన స్నేహితుడదని, ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోచ్చని కేటీఆర్ తేల్చిచెప్పారు.
కుటుంబ ఫంక్షన్‌పై డ్రగ్స్ ముద్ర: జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో 2024 అక్టోబర్‌లో ఒక ఫంక్షన్ జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్న ఈ ఫంక్షన్‌ను కాంగ్రెస్ సర్కార్ రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అర్ధరాత్రి పోలీసులు దాడి చేసి అందులో డ్రగ్స్ దొరికాయని, విదేశీ మద్యాన్ని పట్టుకున్నారని, క్యాసినో పరికరాలు ఉన్నాయంటూ నానా హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టిందనే ఆరోపణలు వచ్చాయి. అయినా దుష్ప్రచారం ఆపడం లేదు. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి రాజ్ పాకాల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా వ్యాఖ్యానించారు.
లగచర్ల ఉదంతం: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులు ఫార్మాసిటీకి భూసేకరణను అడ్డుకొని, అధికారులపై దాడిచేసిన ఘటనలో కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేసింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఏ విషయం వెల్లడించకపోయినా ఆ ఉదంతంలో కేటీఆర్‌కు సంబంధం ఉన్నదని ప్రభుత్వం కట్టుకథ అల్లి అభాసుపాలైంది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ కేసులో: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలను రేవంత్ సర్కార్ మూటగట్టుకున్నది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఏ చిన్న అవకాశం దొరికినా సరే కేటీఆర్ పేరును చేర్చాలని పన్నాగం పన్నింది. తీరా, అందులో ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో నాలుక కరచుకున్నది.
కేటీఆర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో కొన్ని రెండేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్‌పై కేసులు నమోదవుతున్నాయి. అమరవీరుల స్థూపం వద్ద ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘనపై ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో, మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడారని మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో, ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అంటూ సంబోధించారని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో, మూసీ ప్రాజెక్ట్‌పై చేసిన వ్యాఖ్యలకు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో, చార్మినార్ వద్ద నిరసన వ్యక్తంచేసినందుకు చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్‌పై కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటే ఉల్టా కేసులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధారాలుసహా ఫిర్యాదు చేశారు. విచారణ జరపాల్సిందిపోయి తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేశారు. క్యాతంపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆధారాలు సహా బయటపెట్టి, ఆందోళన చేపట్టినందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు చేసి ఆయనను ఆదిలాబాద్ జైలులో పెట్టిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మీడియా..సోషల్ మీడియాపైనా ఉక్కుపాదమే
ప్రశ్నించే ఏ జర్నలిస్టునూ, ఏ సోషల్ మీడియా ప్రతినిధిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. ఎక్కడికక్కడే కేసులు నమోదుచేసి, అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నది. న్యూస్‌లైన్ శంకర్, సరితాయాదవ్, విజయారెడ్డి, శివారెడ్డి, రేవతి, తన్వీయాదవ్ ఇలా ఎవరైనా సరే ఏ వేదిక మీదైనా సరే రేవంత్ సర్కార్‌ను ప్రశ్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని కేసులు పెట్టి జైళ్లల్లో వేస్తామని ఆచరించి మరీ చూపుతున్నది రేవంత్ సర్కార్. ఇక సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడికి తెగబడింది. రక్షణ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంటే.. కార్లలో మారణాయుధాలతో వెంబడించి, దాడికి ప్రయత్నించిన విషయం తెలిసందే. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కార్ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆ వార్తలను కవర్‌చేసిన ‘సౌత్‌ఫస్ట్’ జర్నలిస్టు సుమిత్పైనా సర్కార్ దౌర్జన్యకాండకు దిగింది. తప్పుడు కథనం ప్రచురించారంటూ ఎన్టీవీ జర్నలిస్టులను సైతం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
‘నమస్తే తెలంగాణ’పై అప్రకటిత నిషేధం
మంత్రుల భూదాహాన్ని, కబ్జాపెడుతున్న వందలాది ఎకరాల బాగోతాన్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’పై రేవంత్ సర్కార్ కత్తిగట్టింది. మంత్రులే తమ శ్రేణులను ‘నమస్తే తెలంగాణ’పై రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న దాఖలాలు అనేకం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఇంటిపత్రికను ‘గుమస్తా తెలంగాణ’ అని నిట్టూర్చినా అవును.. మేం తెలంగాణకు గుమాస్తా’లమే అని అనేక సందర్భాల్లో అగ్నిపుణీతగా ‘నమస్తే తెలంగాణ’ అక్షరయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లిన ప్రతిసారీ గొంతెత్తి నినదిస్తున్న ‘నమస్తే తెంలగాణ’పై రేవంత్ సర్కార్ అప్రకటిత నిషేధాన్ని కొనసాగిస్తున్నది. రాజధాని నుంచి మారుమూల ప్రాంతాల దాకా విస్తరించి, తెలంగాణ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రజల గొంతుకగా నిలుస్తున్న అక్షర సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసి తద్వారా తమ ప్రతాపాన్ని చూపాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ తమ దారికి తెచ్చుకోవాలని విఫలయత్నాలు అనేకం చేసింది, చేస్తున్నది. ప్రభుత్వ అక్రమాలను బయటపెడుతున్నందుకు వక్రమార్గంలో కేసులు పెడుతూ, నోటీసులు జారీ చేస్తూ సర్కార్ తన అక్కసు వెళ్లగక్కుతున్నది.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల ‘నమస్తే తెలంగాణ’ విలేకరి కొండా సతీశ్‌పై అక్రమ కేసులు నమోదు చేసి, మానుకోటలోని సబ్ జైలుకు తరలించారు. పెద్దవంగర పోలీస్ స్టేషన్లో బయటి వ్యక్తులతో పోలీసులు కలిసి మందు పార్టీ చేసుకున్నారని, దీనిని సతీశ్ వెలుగులోకి తేగా.. డీజీపీ స్పందించి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష సాధింపు చర్యగా సతీశ్పైనే ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపారు. వేములవాడలో కోడెల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు ‘నమస్తే తెలంగాణ’ విలేకరి.. స్నేహితుడి హాస్పిటల్‌నే సీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండల ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ వీ సత్యనారాయణ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువకావడం లేదంటూ వరస కథనాలు రాస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకొని.. నంనూర్ పంచాయతీ కార్యదర్శిపై బెదిరింపుల కేసు పెట్టించారు. ఒక ఎమ్మెల్యే కొడుకు పోలీసులను ఎగదోసి అమాయకులపై కేసులు పెట్టించి, తద్వారా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని వరంగల్‌లో ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరగణం వరంగల్ యూనిట్ కార్యాలయం ముందు వీరంగం సృష్టించి, వార్త రాసిన విలేకరిని బెదరింపులకు గురిచేసింది.
మన్నె క్రిశాంక్.. కొణతం దిలీప్‌పై లెక్కలేనన్ని కేసులు

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ, అసమర్థ నిర్ణయాలను తప్పుబడుతూ ఆధారాలు సహా బయటపెట్టినవారిపై రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, ఉద్యమకారుడు కొణతం దిలీప్‌పై రేవంత్ సర్కార్ లెక్కలేనన్ని కేసులు పెట్టింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారనే అక్కసుతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా, నల్లగొండ నుంచి నకిరేకల్ దాకా అక్రమ కేసులు నమోదు చేసి ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యకాండ చేస్తున్నది. కోర్టులు జోక్యం చేసుకుంటే కానీ కొణతం దిలీప్‌కు వెసులుబాటు కల్పించని రీతిలో వేధింపులకు గురిచేస్తున్నది. మన్నె క్రిశాంక్‌పై రేవంత్ సర్కార్ పగబట్టినట్టే వ్యవహరిస్తున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ మాఫియాను, రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సహా అనేకమంది ప్రభుత్వ పెద్దల అక్రమాలను ఆధారాలు సహా బయటపెట్టినందుకు మన్నె క్రిశాంక్‌ను రేవంత్ సర్కార్ కంట్లో పెట్టుకున్నది. మన్నె క్రిశాంక్‌ను జైలుకు పంపేదాకా నిద్రపోను అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. అయినా, సరే పట్టువదలని విక్రమార్కుల వలె సర్కార్ అక్రమాలను వెలికితీస్తూనే ఉంటామని, తెలంగాణ ప్రజాహితమే తమ విధానమని వారు స్పష్టంచేస్తున్నారు.
పాడి కౌశిక్‌రెడ్డిపై వరుస కేసులు
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కూడా ప్రభుత్వం కక్ష కట్టింది. మాసబ్‌ట్యాంక్ సీఐ పరుశురాం పట్ల దురుసుగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారని గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడరని కరీంనగర్ వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని సీఎంపై, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆయన బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వెళ్లగా, సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ ఉల్టా ఆయనపైనే కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ‘నువు బీఆర్ఎస్లోనే ఉంటే ఇద్దరం కలిసి తెలంగాణభవన్‌కు పోదాం’ అని పేర్కొన్నందుకు అరికెపూడి గాంధీ తన మనుషులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి దిగడం రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో పోలీసులు ఉల్టా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డినే అక్రమ అరెస్టు చేశారు. ఆ అరెస్టును నిరసిస్తూ.. ఆయన ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు సహా పలువురిపై కేసు నమోదు చేయడం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసులు