ఉ॥ నిద్దములైన భూషణ మణి ప్రకరద్యుతులన్ని దిక్కులన్
దొద్దలు వుచ్చి తల్లి చనుదోయి నడిందల కట్టు మించగా
ముద్దులు సూపుచుం పసిడి ముద్దగతిం దొడమీద నాడు నా
ముద్దు గణేశునిం దలచి మ్రొక్కెద నీ కృతి కార్యసిద్ధికిన్
ఈ పద్యం కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక కావ్యం లోనిది. 1500-1550 మధ్య కాలంలో జీవించిన ఈతనిని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు కసవరాజు, కామాంబికా. ఈ కవి వల్లికొండ మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. విక్రమార్కుడి దివ్య సింహాసనంపై ఉన్న ముప్పై రెండు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలతో సింహాసన ద్వాత్రింశిక కావ్యాన్ని రాశారు గోపరాజు.
వీటిని పదకొండు ఆశ్వాసాలలో పద్యాలుగా మార్చారు. ఈ పద్యం కావ్య ఆరంభంలో గణేశ స్తుతి. పార్వతి మెడలో నిద్దములైన అంటే ప్రకాశిస్తున్న భూషణాల కాంతులు దిక్కులలో వెదజల్లుతూ ఉంటే గణేశుడి తలకట్టు తల్లి చనుదోయి దాటి ఆ తల కూడా ఒక పసిడి ఆభరణం లాగా కనిపిస్తూ ఉందట. ముద్దులు మూట గడుతూ ఆమె తొడలపై ఆడుతున్న గణేషుని తన కృతి కార్యసిద్ధి పొందడం కోసం కవి మొక్కులు సమర్పించుకోవడం ఈ పద్య భావం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ