ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉన్నప్పుడు, సర్కారీ వ్యవస్థలు సర్వం ధ్వంసమైనప్పుడు, జవాబుదారీతనం జాడేలేనప్పుడు, పారదర్శకత మృగ్యమైనప్పుడు, సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? దగా పడిన జనం దండు కడితే ఏం జరుగుతుంది? కేసీఆర్ చెప్పినట్టు.. ఇండియా రియాక్ట్స్!. స్ట్రెయిట్ ఫ్రమ్ ద స్ట్రీట్! గత నెల రోజులుగా అదే జరిగింది. నెత్తురుమండే, శక్తులు నిండే యువజనం.. ఒక్కొక్కరు అగ్నికణమై, రణమై కదిలారు.
ఎవరు వాళ్లంతా? దేశ యవనికపైకి మెరుపులా దూసుకొచ్చిన ఆ యువకిశోరాలెవరు? అధికారపక్షం అహంకారం ఒకవైపు… విపక్షం అస్త్రసన్యాసం మరోవైపు.. చేతగానిరీతిలో కాంగ్రెస్ చేతులెత్తేస్తే, ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నవాళ్లు. జంతర్ మంతర్ వేదికగా భూకంపం పుట్టించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. పైకి నీట్ ఫెయిల్యూర్ పై పోరాటంలా కనిపిస్తుండొచ్చుగానీ.. అది బీజేపీ సృష్టించిన పన్నెండేండ్ల నిర్బంధస్వామ్యపు ఉక్కపోత, ఊచకోత నుంచి.. 125 ఏండ్ల ముసలి కాంగ్రెస్ వైఫల్యాలపై పెల్లుబికిన అసహనం నుంచి పుట్టింది.
నవతరం గొంతు వినాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఆక్రోశాన్ని అణగదొక్కాలని ప్రయత్నించింది. కానీ వాళ్లు పతాకంలా పైకి లేచారు. నినాదంలా ప్రతిధ్వనించారు. లాఠీలకు బెదరలేదు. పెల్లెట్ గన్స్కు వెరవలేదు.. వడిసెలో రాళ్లు పెట్టి కొట్టినట్టు మీమ్స్‌ను వదిలారు. సోషల్‌మీడియాలో అగ్గి పుట్టించారు. యావత్ దేశాన్ని కదిలించారు. ఉక్కుపిడికిలి సడలకుండా ఉద్యమం నడిపారు. ప్రజా ఉద్యమాల్లో ఇది కొత్త వేరియంట్! సంప్రదాయ ఆందోళనలకు ఇది అవుటాఫ్ సిలబస్! విదేశీశక్తులు, పాకిస్థాన్ ఫండింగ్, మతవిభజన వంటి బీజేపీ రెడీమేడ్ ఆరోపణలను దాని పద్ధతిలోనే తిప్పికొట్టారు. జాతీయ జెండాలు చేతబూని లాఠీచార్జి నడుమ వందేమాతరం పాడారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు. ప్రశ్నించిన వాళ్ల నోరు నొక్కుతూ వచ్చిన మోదీ ప్రభుత్వానికి.. జెన్ జీని ఎలా కట్టడిచేయాలో అంతుచిక్కలేదు.
మొదటిసారి.. మోదీ కండ్లలో భయం కనిపించింది. కుర్చీ కదులుతున్న చప్పుడు వినిపించింది. ప్రాపగాండా అంతా ఫటేల్మని పేలిపోయినప్పుడు, వాట్సాప్ యూనివర్సిటీ నెరేటివ్స్ అంతా తునాతునకలైనప్పుడు, అధికార దర్పమంతా ఆత్మరక్షణలో పడినప్పుడు నిద్రపోని కండ్లల్లో ఆందోళన కనిపించింది. 12 ఏండ్లలో తొలిసారి ప్రజాగ్రహానికి తలొగ్గి కేంద్రమంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ, జూలై 25: దేశ యువతరం అసమాన పోరాటంతో అనుకున్నది సాధించింది. విద్యార్థుల ఉద్యమం తీవ్రం కావడంతో తొలుత బెట్టు చేసిన కేంద్రం చివరికి దిగి వచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే దాన్ని ఆమోదించారు. ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ధర్మేంద్ర రాజీనామాతో బొద్దింకల సత్తా అందరికీ తెలిసిందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్య విజయమని పర్యావరణ ఉద్యమకారుడు, విద్యార్థుల ఉద్యమానికి నిరాహార దీక్షతో స్ఫూర్తి నిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్ అభివర్ణించారు. ఇది విద్యార్థులు సాధించిన విజయమని విపక్షాలు, సెలబ్రిటీలు యువ త పోరాటాన్ని ప్రశంసించారు. తాజా పరిణామాలతో కేంద్రం వైఫల్యాలపై ప్రజల ఆగ్రహం మధ్య మూడవ విడత చర్చలు పారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానికి రాజీనామా సమర్పించిన అనంతరం ఎక్స్ వేదికగా ప్రధాన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను రాజీనామా చేశానని.

ప్రయోజనాలే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనవని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా లేఖలో నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి మొదటి రోజు నుంచే తాను బాధ్యత వహించానని ఆయన పేర్కొన్నారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలు తనను కలవరపెట్టాయని చెప్పారు. జంతర్ మంతర్, దేశంలోని ఇతర పాంతాల్లో నెలకొన్న పరిస్థితుల నుంచి దేశ వ్యతిరేక శక్తులు ఎటువంటి లబ్ధి పొందకుండా చూడడటమే తన రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా వారు తమ చదువులు, కెరీర్‌పై దృష్టి సారించేలా చేయడానికి తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.
ధర్మేంద్ర పదవి నుంచి తప్పుకుంటారా లేదా అనే అంశంపై ప్రభుత్వ వర్గాలు శుక్రవారం సాయంత్రం వరకు ఊహగానాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. దీనివల్ల మీడియా, నిరసనకారులు సందిగ్ధంలోనే ఉండిపోయారు. అయితే ఆందోళన ఊపందుకొని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ఆయన రాజీనామాను కోరడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. కాగా, ధర్మేంద్ర రాజీనామాను ప్రభుత్వం ఆమోదించనంత వరకు తదుపరి చర్చల్లో పాల్గొనడంలో అర్థం లేదని అంతకు ముందే సీజేపీ స్పష్టం చేసింది.
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజ్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ ప్రకియలో అవకతవకలపై బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, అలాగే ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యా మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిరసనల తీవ్రత, విస్తృతి పట్ల, అలాగే విద్యాశాఖ మంతిగా ధర్మేంద్ర కొనసాగడంపై యువతలో పెరుగుతున్న అసహనం పట్ల కేందం తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ సుదీర్ఘ ఆందోళన ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను ముఖ్యంగా కీలక మద్దతు వర్గంగా పరిగణిస్తున్న తొలిసారి ఓటు వేసేవారు, యువ ఓటర్లలో దెబ్బ తీయడం ప్రారంభించిందని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఈ ఉద్యమం అంతటా ప్రధాన అంశంగా నిలిచింది. ఆయన పదవి నుంచి తప్పుకున్న తర్వాతే అర్థవంతమైన చర్చలు సాధ్యమవుతాయని ఆందోళనకారులు పట్టుపట్టారు.
నిరసనలకు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో ఈ వ్యవహారం ఎన్నికల పరమైన పరిణామాలకు దారి తీయవచ్చని అధికార పార్టీ ఆందోళన చెందినట్టు సమాచారం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అశాంతిని ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ర్టాల్లో బీజేపీకి ఒక రాజకీయ ప్రతికూల అంశంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ర్టాల్లో యువత ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయని అంచనా. మరింత రాజకీయ నష్టాన్ని నివారించడానికి, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించడం అత్యవసరమని శనివారం రాజకీయ వర్గాల్లోని చాలామంది భావించారు.
జెన్ జీ ఉద్యమానికి తలవంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. కాక్రోచ్ల రూపంలోని విద్యార్థులు, యువత పోరాటాన్ని చూసి దేశం గర్విస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని, తరం మారిందని, విద్యార్థిలోకం మేల్కొన్నదని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిశోర్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చాలాసార్లు రాజకీయ పార్టీల ఉద్యమాన్ని చూశామని, కానీ గత నెల రోజుల నుంచి విద్యార్థి ఉద్యమం దేశాన్ని తట్టిలేపిందని పేర్కొన్నారు. వారిపై దేశద్రోహులుగా ముద్రవేసినా, ఉగ్రవాదులన్నా, విదేశీయుల హస్తమున్నదని ఆరోపణలు చేసినా చివరకు కేంద్రం దిగిరాక తప్పలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పోరాటంలో న్యాయమున్నదనే వారికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని స్పష్టంచేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట పటిమకు నిదర్శనమని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేరొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రాజకీయాలకు అతీతంగా తమ భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం చేపట్టిన ఉద్యమం చివరకు సఫలీకృతమైందని తెలిపారు. నీట్ నిర్వహణలో అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి వ్యతిరేకంగా యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం లాఠీచార్జీలు, బాష్పవాయు గోళాలు, నిర్బంధాలను ఆశ్రయించినప్పటికీ, యువత వెనకి తగ్గకుండా పోరాటాన్ని కొనసాగించిందని ప్రశంసించారు. ‘అధికారం ఎంత బలంగా కనిపించినా, చైతన్యవంతమైన యువత సంకల్పం ముందు తలవంచక తప్పదు’ అని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్యార్థులు, యువత సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా బాధ్యతాయుతంగా పరిషరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థులతో పెట్టుకుంటే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా వేగంగా విచారణ జరుపాలని ఆయన కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సమస్య ముగిసిపోలేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పాత పద్ధతినే కొనసాగిస్తూ లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులకు భరోసా కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిసున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల పోరాటం, వారు సాధించిన విజయం చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పోరాటం కేవలం ఒక సమస్య పరిషారానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలో మార్పును కోరుకునే యువత సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని అభివర్ణించారు. విద్యార్థులు, యువత ఆశయాలను విస్మరిస్తూ పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉద్యమం తీవ్రమైన హెచ్చరికగా మారిందని స్పష్టం చేశారు.
ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాట పటిమ, ఐక్యతకు నిదర్శనమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తలుచుకుంటే ఎంతటి శక్తినైనా ఎదిరించగలరని, ఏ ప్రభుత్వమైనా వారి డిమాండ్ల ముందు దిగిరావాల్సిందేనని ఈ ఘటన స్పష్టం చేసిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యావ్యవస్థతో చెలగాటమాడే హకు ఏ ప్రభుత్వానికీ లేదని స్పష్టంచేశారు. ఆందోళనలు, నిరసనలతో తమ హకుల కోసం వీరోచితంగా పోరాడిన విద్యార్థి లోకానికి అభినందనలు తెలిపారు. పాలకులు.. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేవలం రాజీనామాతో సరిపెట్టకుండా, విద్యార్థులు ఎదురొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి లోకం సాధించిన ఈ విజయం, దేశంలో ప్రజాస్వామ్య పోరాటాలకు కొత్త ఊపిరి పోసిందని కొప్పుల అభిప్రాయపడ్డారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదుల అసాధారణ విజయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. ఎన్ని ఆంక్షలు విధించినా, నిర్బంధాలు చేసినా, లాఠీలెత్తినా.. చివరికి దేశద్రోహులు, సంఘ విద్రోహులు అని ముద్ర వేసినా యువత వెనుకంజ వేయకుండా పోరాడిందని, దీనితో కేంద్రం దిగిరాక తప్పలేదని పేరొన్నారు. విద్యార్థుల పోరాటంలో న్యాయాన్ని గుర్తించి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ధర్నాలో పాల్గొని వారికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
కేంద్ర మంత్రి ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా యువత విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపా రు. అధికార మదం, ఆధిపత్య అహంకారం ఎంతటిదైనా విద్యార్థి చైతన్యం ముందు మోకరిల్లాల్సిందేనని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువ త తిరగబడితే ఏ పీఠమైనా కదలాల్సిందేనని, పరిపాలనలో జవాబుదారీతనం మరిచి, బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తే యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సకాలంలో బాధ్యత తీసుకోకుండా అలసత్వం వహించిన ఫలితమే ఈ రాజీనామా అని విమర్శించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత సాధించిన అసాధారణ విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య శక్తులకు ఇది నూత న ప్రేరణ ఇస్తుందని పేరొన్నారు. ఈ పరిణామం కొత్త రాజకీయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. దేశంలో నెలకొన్న విద్యా సమస్యలు, నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం సాధారణ విషయం కా దని అన్నారు. ప్రజలు ఎప్పుడూ పాలకుల నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తారని, ఈ ఘటన భవిష్యత్తులో కొత్త రాజకీయాలకు బలమైన బాటలు వేయాలని ఆకాంక్షించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కొందరు వ్యంగ్యంగా స్పందించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఢిల్లీలో ఆందోళనకు పూనుకున్న విద్యార్థులు, యువతపై ఎన్ని ఆంక్ష లు విధించినా వెనుకడు గు వేయకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఆగ్రహించి పోరుబాట పడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ప్రభుత్వాలు తెలుసుకోవాలని సూ చించారు. నీట్ ప్రశ్నపత్రాల లీక్, పరీక్ష రద్దు తో ఎంతో కష్టపడి చదివిన పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రం కనికరించలేదని అన్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడితే ప్రభుత్వానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు.