నీట్ ప్రశ్నాపత్రం లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. అంటూ విద్యార్థులు, యువత పిడికిలి బిగించి ఉద్యమించారు. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన యువత, విద్యార్థిలోకంపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా లెక్క చేయలేదు. పోలీసులు ఇష్టారీతిన లాఠీలతో కొడుతున్నా.. ఈడ్చుకెళ్లి పడేస్తున్నా.. కేసులు పెడుతున్నా న్యాయం, ధర్మం కావాలని నినదించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హైదరాబాద్‌లో విద్యార్థులకు సంఘీభావం తెలిపి, పోరుబాటకు జైకొట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని, నీట్ పరీక్ష రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబానికి పరిహారం అందించాలని పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ససేమిరా అంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు విద్యార్థులు ఆందోళనకు పూనుకున్నారు. చేసేది లేక దిగొచ్చిన కేంద్ర సర్కార్.. విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించింది. ఎవరెన్ని చెప్పినా ఇది విద్యార్థులు, యువత పోరాట స్ఫూర్తితోనే సాధించిన విజయం. వారి పోరాట పఠిమను కొనియాడుతూ బీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.
– ఖమ్మం, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మార్పునకు సంకేతం
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల పోరాటం, సాధించిన విజయం చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది ఒక సమస్య పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలో మార్పును కోరుకునే యువత సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు. విద్యార్థులు, యువత ఆశయాలను విస్మరిస్తూ పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉద్యమం తీవ్రమైన హెచ్చరిక వంటిదని పేరొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని, వారికి గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఈ విజయం మరోసారి స్పష్టం చేసిందన్నారు. ఇకపై విద్యార్థులు, యువత సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో స్పందించి, ప్రజా సంక్షేమం, విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అజయ్ డిమాండ్ చేశారు.
-పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
ఇది ప్రజాస్వామ్యవాదుల విజయం
నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదుల విజయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత పోరుబాట పడితే అది ఏ స్థాయిలో ఉంటుందో యావత్ ప్రపంచం మరోసారి చూసిందని గుర్తు చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా.. బెదిరించినా.. భయపెట్టినా.. నిర్బంధాలు ప్రయోగించినా.. లాఠీలు ఝుళిపించినా.. దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు అని ముద్రవేసినా కూడా యువత వెనుకంజ వేయకుండా ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదన్నారు. విద్యార్థుల పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించడాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. దేశంలో ఇక ముందు ఎలాంటి పరీక్ష ప్రశ్నాపత్రాలు కూడా లీక్ కాకుండా, అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా హితవు పలికారు.
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ లీడర్
ఉద్యమంలో వెనుకంజ వేయని యువత
ఢిల్లీలో ఆందోళనకు పూనుకున్న విద్యార్థులు, యువతపై పోలీసులు, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనుకడుగు వేయకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. కాక్రోచ్ సైన్యాన్ని చూసి దేశం గర్విస్తోందని, విద్యార్థులు, యువత ఆగ్రహించి పోరుబాట పడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ప్రభుత్వాలు చూసి తెలుసుకోవాలన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం వల్ల ఎంతో కష్టపడి చదివిన పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్ర ప్రభుత్వం కనికరించలేదన్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలిపితే అప్పుడు ప్రభుత్వానికి తెలిసొచ్చిందని, జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష పేపర్ లీకులు కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే జరిగాయన్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో సంఘీభావం తెలపడంతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం ఆందోళనలకు దిగాయని గుర్తు చేశారు.
-తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ
ఉద్యమానికి తలవంచిన కేంద్ర సర్కారు
ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా విద్యార్థులు సాగించిన ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేరొన్నారు. విద్యార్థులపై అణచివేత చర్యలకు పాల్పడిన ప్రభుత్వం చివరకు ప్రజా ఒత్తిడికి లొంగి వెనకి తగ్గడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందనే విశ్వాసంతో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను సైతం పకనబెట్టి వేలాది మంది జెన్ జీ విద్యార్థులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. యువత సమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాటానికి సంఘీభావం తెలపడం నాయకత్వ లక్షణానికి నిదర్శనమన్నారు. దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే యువత సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ముందుకు రావడం అభినందనీయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి విజయం సాధించిన ప్రతీ విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
– సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే
రాజీనామాతోనే బాధ్యత ముగిసిపోదు..
లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలతోనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల సమస్య ముగిసిపోలేదని వైరా మాజీ ఎమ్మెల్యే భానోతు చంద్రావతి పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం అత్యంత కీలకమన్నారు. పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు పెట్టుకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ పరిణామమైనా అత్యంత బాధాకరమని, ఈ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే మంత్రి రాజీనామాతోనే బాధ్యత ముగిసిపోలేదని, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర సంసరణలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల కలలకు భరోసా కల్పించే విద్యా వ్యవస్థను నిర్మించడం ప్రతీ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
-బానోత్ చంద్రావతి, వైరా మాజీ ఎమ్మెల్యే