మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు అరిగోస పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. నెల రోజులుగా యూరియా లభించకపోవడంతో రైతులు కుటుంబాలతో కలిసి సొసైటీ కార్యాలయాలు, గోదాముల వద్ద పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేస్తుంటే వారిని టార్గెట్ చేసుకున్న అధికారులు వారి ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే దీనిని ఓర్వలేని కాంగ్రెస్ సర్కారు పీసీ ఘోష్ కమిషన్‌తో తప్పుడు రిపోర్టు తయారు చేయించిందని మండిపడ్డారు. కేసీఆర్‌పై సీబీఐతో విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.