Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు పౌష్టికాహారం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించి, మధ్యాహ్నభోజనం అందించటంలో సర్కారు విఫలమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఆకలితో ఉన్న విద్యార్థులు అన్నంలో కారం, నూనెతో కలుపుకుని కడుపు నింపుకున్న ఉదంతాన్ని ఆయన ఉదహరించారు. భావిభారత పౌరులపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమని ఆయన ఎక్స్‌వేదికగా విమర్శించారు.
మధ్యాహ్న భోజన పథకం భోజన సామగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని ఆయన కోరారు.