Farmers | అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి! కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతు పరిస్థితి ఇదే. వడ్లు ఆరబోసుకొని సర్కార్ కాంటా కోసం ఎదురుచూస్తున్నాడు రైతు. సరిపడా కొనుగోలు కేంద్రాల్లేవు. తెరిచే ప్రయత్నమూ లేదు. యాసంగి వడ్లలో ఇప్పటిదాకా సర్కార్ కొన్నది పదోవంతు కూడా లేదు. వానకాలం దగ్గరబడుతున్నా ఇంకా 2500 చోట్ల అసలు కొనుగోలు కేంద్రాలనే తెరువలేదు. తెరిచిన వాటిలోనూ అత్యధికం రిబ్బన్ కటింగ్‌లకే పరిమితమైంది. అక్కడ తవ్వెడు వడ్లనైనా ప్రభుత్వం కొనలేదు. ఆ జాప్యమే రైతుకు శాపమవుతున్నది. పంటను మార్కెట్లో పోసుకొని, రేపోమాపో కొనకపోతరా అని పడిగాపులు పడుతున్నాడు. వడ్లేకాదు.. మక్కలదీ అదే పరిస్థితి. జొన్నలైతే మరీ దయనీయం. రాష్ట్రం కొనదు.. కేంద్రం పలుకదు.
ఆరుగాలం శ్రమ.. అంగట్లో ఆగమైతున్నది. చెడగొట్టు వానల నుంచి, దళారుల నుంచి, మార్కెట్ దగా నుంచి పంటను కాపాడుకున్నా.. కనికరం లేని సర్కార్ కర్షకుడి వైపు కన్నెత్తయినా చూడటం లేదు. పైగా ఆన్లైన్ ట్రక్షీట్లు అంటూ రోజుకో కొర్రీ పెడుతున్నది. డీజిల్ కొరతతో కోతలు ఆగుతున్నయ్. గన్నీబస్తాలు లేక రవాణా ఆగుతున్నది. సీజన్ ముగిసి నెలదాటినా ఇంకా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిగి చూస్తూనే ఉన్నది. ప్రభుత్వ తీరుతో కడుపుమండిన రైతులు రోడ్డెక్కుతున్నరు. నీళ్లివ్వక, ఎరువులివ్వక, బోనస్ ఇవ్వక, గన్నీ బస్తాలివ్వక, ఆఖరికి పంట కొనక.. ఇంకెంతకాలం తమ ఉసురుపోసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ)/కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ కాఠిన్యం ప్రదర్శిస్తున్నది. అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతున్నది. సర్కార్ అలసత్వం, పట్టింపులేనితనంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ, ఈ 20 రోజుల్లో సుమారు 7 లక్షల టన్నులే కొన్నట్టు సమాచారం. సీజన్ పూర్తికావస్తున్నా కనీసం 10 శాతం ధాన్యం కూడా కొనలేకపోవడంపై అన్నదాతల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఇదే సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు సర్కార్ ప్రకటించింది.
కానీ, ఇప్పటివరకు కేవలం 6వేల కొనుగోలు కేంద్రాలే ప్రారంభమయ్యాయి. వాటిలో అత్యధిక కేంద్రాల్లో కాంటా పెట్టలేదు.. గింజ ధాన్యం కొనలేదు. దీంతో రోడ్లపై, కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు కుప్పలు, తెప్పలుగా ఉన్నాయి. ఈ దశలో అకాల వర్షాల భయం రైతులను వెన్నాడుతున్నది. ఇటు ప్రభుత్వం కొనుగోలు చేయక, అటు వర్షానికి ధాన్యం తడుస్తుందన్న భయంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదే సమయంలో పౌరసరఫరాల శాఖ కొత్త నిబంధనల పేరుతో రైతులను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా అంశాలను బట్టి అసలు కొనుగోలు బాధ్యతల నుంచే సర్కార్ తప్పించుకోజూస్తున్నదని అర్థమవుతున్నది.
కొనుగోలులో తీవ్ర జాప్యం
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తున్నది. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించి 20 రోజులు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు సుమారు 6 వేల కేంద్రాలనే ప్రారంభించినట్టు తెలిసింది. ఓవైపు కేంద్రాలు ప్రారంభించకుండా ఆయా ప్రాంతాల రైతులను ఇబ్బందులు పెడుతూనే, మరోవైపు ప్రారంభించిన కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారే తప్ప.. అక్కడ కాంటా పెట్టిందిలేదు.. గింజ కొన్నదీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్నది కొసరే
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం బారెడు ఉంటే.. ఇప్పటివరకు కొన్నది మూరెడే. యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా, అందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ 20 రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ లెక్కన రోజూ సగటున 30 వేల టన్నులకు మించడమే లేదు. దీని ప్రకారం 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి 300 రోజుల సమయం పడుతుంది.
రైతుల్లో అకాలవర్షం గుబులు
ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయంలో సర్కార్ తాత్సారం చేస్తుండగా, అకాల వర్షాల భయం రైతులను వెన్నాడుతున్నది. ఎప్పుడు వాన పిడుగు పడుతుందో.. ధాన్యం వరద పాలవుతుందోనని రైతులు గుబులు చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ బాధను అర్థం చేసుకొని ధాన్యం కొనుగోలులో వేగం పెంచాల్సిన అధికారులు.. మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ ట్రక్‌షీట్, వాహనాలకు జీపీఎస్ పేరుతో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నది. ఈ కారణంగా కొనుగోళ్ల ప్రక్రియ నెమ్మదిస్తున్నది. దీంతో కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది.
మాకొద్దీ ధాన్యం
రాష్ట్రంలో గత యాసంగి, వానకాలాలకు చెందిన ధాన్యమే తమ వద్ద ఉన్నదని, ఈ పరిస్థితుల్లో తాజాగా రబీ ధాన్యం దింపుకోలేని పరిస్థితి ఉన్నదని, ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల మిల్లర్లు ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024-25 రబీ సీజన్లో 1,10,000 టన్నులు, 2025-26లో 1,40,000 టన్నుల ధాన్యం అంటే రెండు సీజన్లలో మొత్తం 2,50,000 టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉన్నదని, దీంతో మిల్లుల్లో దాదాపు 90 శాతం స్థలం నిండిందని, ఈ పరిస్థితుల్లో తాజాగా వచ్చే ధాన్యం దింపుకోవడం సాధ్యం కాదని గత నెల 6న కలెక్టర్‌ను కలసి మిల్లర్లు విన్నవించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కేంద్రం నుంచి బాయిల్డ్ కోటా తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతుండటంతో గత సీజన్లకు సంబంధించిన ధాన్యమే ఎక్కడికక్కడ మూలుగుతున్నది. ఇటువంటి పరిస్థితులున్నప్పుడు జిల్లాల వారీగా సమీక్షలు పెట్టాల్సిన మంత్రులు ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
25 రోజులైనా ధాన్యం కొంటలేరు
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు 25 రోజులు అమ్మకాలకు రైతులు ధాన్యం తెస్తున్నారు. నేటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇటీవలే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్టు ప్రజాప్రతినిధులు, అధికారులు కొబ్బరికాయలు కొట్టివెళ్లారు. కానీ, ఇంతవరకు కాంటా పెట్టనేలేదు. ధాన్యం కొనడమే లేదు. ఈ మార్కెట్ యార్డులో ఇప్పటికే 204 మంది రైతులు ధాన్యం తెచ్చి ఉంచారు. ఇవే ఉన్నాయంటూ వారిలో కేవలం 40 మంది రైతులకే టార్పాలిన్లు ఇచ్చారు. మరో 32 మంది రైతులు వారి సొంత ఖర్చులతో తెచ్చిన టార్పాలిన్లు కప్పి ఉంచారు. మిగతా రైతుల పరిస్థితి అగమ్యగోచరం. ఏ చిన్న వర్షం వచ్చినా అన్నదాత బతుకులు ఆగం కానున్నాయి.
కురిక్యాలలో కొనే దిక్కులేదు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 20 రోజులుగా ధాన్యం కొనేదిక్కు లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 94 మంది రైతులు ఇప్పటికే ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. విచిత్రం ఏమిటంటే.. ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఒక్క టార్పాలిన్ కూడా లేదు. రైతులే ఇండ్ల నుంచి తెచ్చి కప్పి ఉంచారు. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టారు. కానీ, కొనుగోళ్లు చేయడమే లేదు.
జాడలేని మంత్రులు
వరి కోతలు ప్రారంభమై దాదాపు 25 రోజులపైనే అయింది. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడానికి గడిచిన 20 రోజుల నుంచే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో మినహా.. ఇన్చార్జి మంత్రులు, లేదా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలే లేవు. ‘కొనుగోలు చేయండి’ అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై ఏ మంత్రి కూడా ఆరా తీసి రైతులు అవస్థలు తీర్చిన సందర్భాలు లేనేలేవు. దీంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది.
పట్టించుకునే దిక్కు లేదు
గంగాధర మార్కెట్ యార్డుకు 2 వారాల క్రితమే ధాన్యం తెచ్చిన. ఇటీవలే కొబ్బరికాయ కొట్టి వెళ్లిన్రు. తెల్లవారి నుంచే కొంటమన్నరు. కానీ, ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. ఒక్క గింజ కొనలేదు. మల్ల ఓ కొత్త కిరికిరి పెడుతున్నరు. ఏ గ్రేడ్ ధాన్యమైనా కామన్ కింద కొంటామంటున్నరు. దీని వల్ల క్వింటాకు రూ.20 లాస్ అవుతుంది. సర్కార్ నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్నప్పుడు కామన్ రకం ఎలా కొంటరు. కచ్చితంగా మద్దతు ధర ఇవ్వడమే కాదు, వెంటనే కొనుగోలు చేయాలి.
– రామయ్య, రైతు (గంగాధర)
20 రోజులుగా ఎదురుచూస్తున్నం
నేను 20 రోజుల కింద మార్కెట్‌కు ధాన్యం తెచ్చిన. నాకంటే 10 రోజుల ముందు చాలా మంది ధాన్యం తెచ్చి పోసిన్రు. అయినా ఇప్పటివరకు కొనడమే లేదు. నిబంధనల ప్రకారం ఎఫ్ఏక్యూ కూడా వచ్చింది. అధికారులు రేపు, మాపు అంటున్నారే తప్ప ఎప్పుడు కొంటారో చెప్పడమే లేదు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేసి ఉంటే మాకీ తిప్పలుండవు. కుప్ప వద్దకు రోజూ వచ్చి వెళ్లడం వల్ల ఇతర పనులు చేసుకోలేకపోతున్నం. ప్రభుత్వం కనికరించి ఇప్పటికైనా కొనుగోలు చేయాలి
– చంద్రమౌళి, రైతు (కొండన్నపల్లె)