హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నీటిపారుదలశాఖలోనూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం పదోన్నతుల విషయంలో తీవ్రమైన వివక్ష చూపుతున్నదని సీనియర్ ఇంజినీర్లు మండిపడుతున్నారు. సమన్యాయం పాటించకుండా ఒకే వర్గానికి కొమ్ముకాస్తున్నారని నిప్పులుచెరుగుతున్నారు. అర్హులకు పదోన్నతులు ఇవ్వకుండా నచ్చినవారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై జలసౌధలో ఇంజినీర్లు ధ్వజమెత్తుతున్నారు.
నీటిపారుదలశాఖలో ఏండ్ల తరబడిగా జోన్-5, జోన్-6 ఇంజినీర్ల మధ్య వివాదం నెలకొన్నది. రాష్ట్రపతి పాత ఉత్తర్వుల ప్రకారం జోన్-6లోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువమంది ఇంజినీర్లు, జోన్-5లోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో తక్కువ మంది ఇంజినీర్లు ఉన్నారు. దీంతో ఒకేసారి నియామకమైనప్పటికీ జోన్-6లోని ఇంజినీర్లు త్వరగా, జోన్-5లోని ఇంజినీర్లు ఆలస్యంగా ప్రమోషన్లు పొందుతున్నారు. ఈ వ్యవహారంపై నీటిపారుదలశాఖలో దశాబ్దాలుగానే వివాదం నెలకొన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఇంజినీర్ల సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంజినీర్లు అప్పటి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. కమిటీ ఏర్పాటు చేసి, సిఫారసుల ఆధారంగా 12 సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారు. తుదితీర్పునకు లోబడి ఉంటామని, కేసీఆర్ ప్రభుత్వం ఇంజినీర్లకు అడ్హాక్ ప్రమోషన్లు కల్పించింది.
839 మంది డీఈఈలకు ఈఈలుగా, 279 మంది ఈఈలకు ఎస్ఈలుగా, 75మంది ఎస్ఈలకు సీఈలుగా, నలుగురు సీఈలకు ఈఎన్సీలుగా పదోన్నతులు ఇచ్చింది. ఇన్చార్జి పోస్టులు లేకుండా హోదాకు తగ్గట్టుగా పేస్కేళ్లు పొందే అవకాశం కల్పించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను జఠిలం చేస్తున్నది. ఏడాదిలో 60మంది వివిధ హోదాల్లో కీలక ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. ఆయా స్థానాల్లో ఇతర సీనియర్లకు ప్రమోషన్లు కల్పించాల్సిన ప్రభుత్వం తమవారికి ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే వివక్షకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. వివక్షను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.