Harish Rao | మన పుట్టిన ఊరును మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించికుని 9వ వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీలకు హాజరై హరీశ్‌రావు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్న మీ స్థానిక కౌన్సిలర్ చొరవ అభినందనీయమని కొనియాడారు. అందరూ మంచి పోటీతత్వంతో ముగ్గులు బాగా వేశారని ప్రశంసించారు.
మన సాంప్రదాయాలు కాపాడాలని హరీశ్‌రావు అన్నారు. మన పిల్లలకు, నేటి తరానికి మన పండుగలు, వాటి గొప్పతనాన్ని గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తానని మాట తప్పిండని అన్నారు. బతుకమ్మ చీరలు, తులం బంగారం ఎగ్గొట్టిండని.. పాత పథకాలు బంద్ అయిపోయాయ్, కొత్త రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు.
Harish Rao