56 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్)పై రేవంత్ సర్కార్ కన్నుపడింది. దాన్ని ఎలాగైనా తన ఆధీనంలోకి తీసుకోవాలని చేయని ప్రయత్నం లేదు. బకాయిలను నష్టాలుగా చూపించి, లైసెన్స్ రెన్యువల్ నిలిపివేసింది. సంస్థను ఎన్పీడీసీఎల్కు అప్పగించింది. పాలకవర్గం ఒకవైపు న్యాయ పోరాటం చేస్తుండగానే మరో కుట్రకు తెర లేపింది. 2014 నుంచి 2026 వరకు సెస్ కార్యకలాపాలపై విచారణకు ఆదేశించింది.
రాజన్న సిరిసిల్ల, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్తు సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్)పై కాంగ్రెస్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. 2026 మార్చి 31వరకు లైసెన్స్ గడువు ముగియగానే రెన్యువల్ చేయకుండా నిలిపివేసింది. సెస్ వ్యాపార లైసెన్స్‌ను రద్దు చేసి ఎన్పీడీసీఎల్కు అప్పగించి వ్యాపార లైసెన్స్‌ను సైతం ఇటీవలే జారీ చేసింది. సెస్ లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా ఇరువర్గాల వాదోపవాదాలు విని ఈ నెల 17న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇంతలోనే సర్కార్ సిరిసిల్ల సెస్‌ను ఎలాగైనా ఆధీనంలోకి తీసుకోవడానికి మరో కుట్రకు తెరలేపింది. సెస్‌కు ఎండీగా తిరుపతిని నియమించింది. ఇదే క్రమంలో సెస్‌లో 2014 నుంచి 2026 మార్చి వరకు విచారణ జరుపాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ అధికారిగా జగిత్యాల డీసీవో మనోజ్‌కుమార్‌ను నియమించింది. సహకార చట్టం-51 ప్రకారం విచారణ చేయాలని ఈ నెల 26న ఆదేశించింది. పాలకవర్గాన్ని పట్టించుకోకుండా సెస్ సంస్థ ఉద్యోగులను స్వాధీనం చేసుకొని ఏప్రిల్ 1 నుంచి ఎన్పీడీసీఎల్ విద్యుత్తు సరఫరా సేవలు అందిస్తున్నది. హైకోర్టులో తీర్పు రిజర్వు ఉండగా సెస్‌పై విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పు పాలకవర్గానికి అనుకూలంగా వస్తుందనే అనుమానంతో ఈ చర్యలకు పూనుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
పాలకవర్గంలో ప్రాతనిధ్యంలేని కాంగ్రెస్
సిరిసిల్ల సెస్ స్థాపించినప్పటి నుంచి పాలకవర్గాలు, చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరూ కూడా లేరు. 2007 జరిగిన సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022లో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నది. 56 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సెస్‌పై రేవంత్ సర్కార్ కన్నుపడింది. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతున్నది. సెస్ బకాయిలు పేరిట నష్టాల్లో ఉన్నదని సాకుగా చూపి లైసెన్స్‌ను రెన్యువల్ చేయకుండా ఎన్పీడీసీఎల్కు అప్పగించి విమర్శలకు తావిచ్చింది. సెస్ పాలకవర్గంలో అధికార పార్టీ లేకపోవడం, సిరిసిల్లలో కేటీఆర్‌పై అక్కసుతో సెస్‌ను ఎన్పీడీసీఎల్లోనే విలీనం చేయడానికి అన్ని ప్రయత్నాలను సర్కార్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
లైసెన్స్ రెన్యువల్ చేయకుండానే..
2014 నుంచి 2026 వరకు సెస్ పరిపాలనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2014లో ఫిబ్రవరిలో త్రీమెన్ కమిటీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా కే జగన్మోహన్రెడ్డి, సభ్యులుగా పత్తిపాక లక్ష్మీరాజం, పాత సత్యలక్ష్మి ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ త్రీమెన్ కమిటీని 2014 జూన్‌లో రద్దు చేసింది. తర్వాత గూడూరి ప్రవీణ్‌ను చైర్మన్‌గా నియమించగా, పలువురు కోర్టును ఆశ్రయించడంతో కమిటీని రద్దు చేసింది. 2016లో సెస్‌కు ఎన్నికలు నిర్వహించగా సెస్ చైర్మన్‌గా దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్‌గా లగిశెట్టి శ్రీనివాస్‌తోపాటు పాలకవర్గం ఏర్పాటైంది. వీరి పాలకవర్గం ముగియగానే 2022 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించగా చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతితోపాటు పాలకవర్గం కొలువుదీరింది. ఈ పాలకవర్గ పదవీకాలం మరో 18నెలలు ఉండగానే సిరిసిల్ల లైసెన్స్ రెన్యువల్ చేయకుండా ఎన్పీడీసీఎల్కు అప్పగించింది.
పాలన తీరుపై విచారణ
సెస్‌లో జరిగిన పరిపాలన, పాలకవర్గాల నిర్ణయాలు, బైలా, ఉద్యోగ నియామకాలు, నియమ నిబంధనలు, మహాసభ మినిట్స్, చెల్లింపులు, లావాదేవీలు, విద్యుత్తు పరికరాల కొనుగోలు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లు, ఫైనల్ ఆడిట్ వివరాలు, పేమెంట్ ఓచర్లు, అన్ని బ్యాంకుల కరెంట్, అండ్ సేవింగ్ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. సెస్ పాలకవర్గాలు, మేనేజింగ్ డైరెక్టర్లు, సిబ్బంది, జీతభత్యాలు, చెల్లింపులు తదితర అంశాలపైనా విచారణ చేపట్టనున్నారు.