హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తున్నదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పేద బ్రాహ్మణులను అభివృద్ధి పథంలోకి తీసుకొని రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేశారు.
ఈ పరిషత్ ద్వారా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేండ్లుగా నిధులు విడుదల చేయకపోవ డం, పరిషత్‌కు పాలకమండలిని నియమించకపోవడంతో ఆయా పథకాలు నిలిచిపోయా యి. ఈ ఏడాది బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షే మం కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించగా, పరిషత్ నుంచి అందిన ప్రతిపాదనలు 350 కోట్ల వరకు ఉన్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులు, సదన్ నిర్వహణ కోసం మాత్రమే సరిపోతాయని పరిషత్ అధికారి ఒకరు చెప్పారు.
కాగా, గత సంవత్సరం బడ్జెట్లో రూ.100 కోట్లు ప్రకటించినప్పటికీ, అందులో రూ.60 కోట్లు మాత్రమే విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. అందులోనూ రూ.25 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మరో రూ.35 కోట్లను ఈ నెల 31లోగా విడుదల చేయకపోతే అవి వెనక్కి మళ్లే అవకాశముందని పరిషత్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.. బ్రాహ్మణ సంఘాలు సైతం పరిషత్‌కు రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 2017 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2023 వరకు పరిషత్ ఆధ్వర్యంలో అనేక పథకాలను విజయవంతంగా అమలుచేశారు. వందలాది మంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక సాయం అందింది. వందలాది మంది ఔత్సాహికులకు ఆర్థిక సాయం అందడంతో వారు వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ఏటా రూ.100 కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించేది.
దీంతో సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ, బ్రాహ్మణ సదన్ల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఆయా సంక్షేమ పథకాలు, నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు రూ.350 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను పూర్తిగా విస్మరించింది. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆయా పథకాలు అటకెక్కాయి. వాస్తవానికి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, గత ప్రభుత్వ హయాంలో నియమితులైన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, సభ్యులు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వారి స్థానంలో ప్రభుత్వం కొత్త చైర్మన్, సభ్యులను నియమించాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు కార్యవర్గం లేకపోవడంతో దీని ఆధ్వర్యంలో నడువాల్సిన బ్రాహ్మణ సదన్, అపరకర్మ భవనం లాంటివి నిర్వహణ సరిగా లేక ముందుకు సాగడం లేదు.
మరోవైపు వివేకానంద విదేశీ విద్యాపథకం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీం, వేదపాఠశాలలు, పండితులకు పారితోషికాలు, మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు తదితర పథకాలకు సాయం నిలిచిపోయింది. పరిషత్‌కు ఉన్న నలుగురు ఉద్యోగులు కూడా ఏం చేయాలో తోచక నామమాత్రంగా వచ్చిపోతున్నారు. గత రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పలుమార్లు విన్నపాలు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.