KTR | కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా.. అనాలోచితంగా.. బాధ్యతా రాహిత్యం, చరిత్ర, ఉద్యమంపై అవగాహన లేకుండా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చేస్తానంటూ తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఈ విషయంలో విపరీతమైన ఏవేదన ఉందని.. వారి ఆవేదన బీఆర్ఎస్ పార్టీ గొంతుకై నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనిని కూడా శాసనసభ, మండలిలో నిలదీస్తామన్నారు. తెలంగాణ ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్రాన్ని ఒక వైపు సంక్షోభంలో నెట్టిందని.. మరో వైపు గ్రామ పంచాయతీల్లో సంక్షోభ పరిస్థితులు తీసుకువచ్చిందని ఆరోపించారు. గ్రామాల్లో కనీసం పిచికారీ చేసేందుకు పైసలు ఇచ్చేవారు లేరని.. ఇవాళ సర్పంచులు కూడా లేరన్నారు. తాజామాజీ సర్పంచులకు బిల్లులు ఇచ్చే దిక్కులేదన్నారు.
ఉన్న సెక్రెటరీలకు సైతం డబ్బులు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. పల్లె ప్రగతి పేరుతో చక్కగా కార్యక్రమాలు నడిచి.. దేశంలోనే అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయంటే.. తెలంగాణలోనే ఉన్నాయనే విధంగా పంచాయతీరాజ్ శాఖను బీఆర్ఎస్ నడిపించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ను నాశనం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ప్రజల తరఫున, తాజా మాజీ సర్పంచుల తరఫున వారి ఆవేదనను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. దళితబంధు కార్యక్రమం అమలు చేస్తే.. తాము రూ.12లక్షలు ఇస్తామని చెప్పారని.. అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఇస్తామని చెప్పి సంవత్సరం దాటిందని.. ఇప్పటి వరకు రూపాయి విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రైతుబంధులో రెండోవిడత డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని దళితుల తరఫున బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారును నిలదీస్తుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలున్నాయని.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి.. రకరకాల డిక్లరేషన్ల పేరిట.. బీసీ రిజర్వేషన్ల పేరుతో గద్దెనెక్కిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని, రూ.లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, సబ్ ప్లాన్ పెడతామని అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. ప్రతి అంశం, డిక్లరేషన్, 420 హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై గొంతు విప్పుతామన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై.. శాసనసభ, మండలిలో మీ ఆవేదన, మీ ఆర్తిని అక్కడ వినిపిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.