Harish Rao | విద్య లేనిదే విముక్తి లేదనే సిద్ధాంతాన్ని అంబేద్కర్ నమ్ముకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. అమెరికాలో, యూకేలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన.. తాను చదువుకున్న విద్యను చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తెచ్చేందుకు ఉపయోగించారని కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చదువు, బోధించు, సమీకరించు, పోరాడు అనే మంత్రాన్ని అంబేద్కర్ మనకు బోధించాడని అన్నారు.
అంబేద్కర్ భిక్ష వల్ల వివిధ రంగాల్లో ఎంతో మంది గొప్ప అవకాశాలు పొందారని హరీశ్‌రావు అన్నారు. అమెరికా వంటి దేశంలో మహిళలకు చాలా సంవత్సరాలు ఓటు హక్కు ఉండేది కాదు, కానీ స్వతంత్ర భారతంలో అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు అంబేద్కర్ రాజ్యాంగమే దారి చూపిందని అన్నారు. మెజార్టీ వర్గం ఒప్పుకుంటేనే విభజన జరగాలని నాడు అందరూ అంటే, మెజార్టీ అనే పదాన్ని లేకుండా చేశారని చెప్పారు. ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో చేర్చి తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. 175 మంది ఆంధ్రా, 119 తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ అనే పదం ఉంటే ఇప్పటికీ తెలంగాణ వచ్చేది కాదని వివరించారు. అందుకే అంబేద్కర్ అందరి వాడు, తెలంగాణకు మరింత దగ్గరి వాడు అని చెప్పారు.
విదేశీ విద్య ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు బీఆర్ఎస్ పంపించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఆ పథకంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి విద్య కంటే ప్రాధాన్యం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు. వెంటనే అంబేద్కర్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు కట్టుకోవడానికి అదనంగా లక్ష అంటే 6 లక్షలు ఇస్తమని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ జీవోను చూస్తుంటే అందరితో పాటు ఎస్సీ, ఎస్టీలకు రూ.5లక్షలే ఇస్తున్నట్లు ఉందని అన్నారు. అసెంబ్లీ చెప్పి మరీ మాట తప్పుతారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు అదనంగా లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. చేతలు గడప దాటడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దాదాపు 40 శాతం ఆగాయని తెలిపారు. జీవో 55 తీసుకొచ్చి కేసీఆర్ రిజర్వేషన్లు కాపాడితే, కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకువచ్చి విద్యార్థుల అవకాశాలను దూరం చేసిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా ఇదే విషయమై ప్రశ్నించానని గుర్తుచేశారు. టీచర్లు, మేధావులు ఉద్యోగులు ఈ అంశంపై స్పందించాలని కోరారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే దళిత బిడ్డగా భట్టి విక్రమార్క ఎలాంటి సమాధానం చెప్పలేదని అన్నారు. జీవో 29పై అందరూ స్పందించాలని.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దీనిపై తాము కూడా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్బంగా పేద పిల్లలు చదువుల గురించి ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ ఏడ్యూకేషనల్ సోసైటీ కి రూ.2లక్షల రూపాయలు ఆర్థికసాయం అందజేశారు.