మహబూబ్నగర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి బలవంతంగా పార్టీ మార్పించిన ఘటన మరువకముందే మరో బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ గూండాలు వార్నింగ్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తున్నది. ‘ఈ రోజు నుంచి కాన్వాసింగ్ ఆపకపోతే నిన్ను చంపేస్తాం’ అని కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి 8వ వార్డు అభ్యర్థి కోనేరు సాయప్పకు వార్నింగ్ ఇచ్చారు. సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలో ఆయన సోదరుడి అండతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారనడానికి ఇది ఉదాహరణగా నిలుస్తున్నది.
ఎక్కడ మున్సిపాలిటీ చేజారిపోతుందోనన్న భయంతో.. సీఎం సొంత ఇలాకాలో ఓడిపోతే పరువుపోతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 4వ వార్డు అభ్యర్థి ఎరుకల కృష్ణయ్య అలియాస్ శ్రీనును కిడ్నాప్ చేసి 12 గంటలు గడవక ముందే మరో అభ్యర్థికి వార్నింగ్ ఇవ్వడం తీవ్ర సంచలనం కలిగిస్తున్నది. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సాక్షాత్తు సీఎం నియోజకవర్గం కావడంతో రాష్ట్రం మొత్తం దృష్టి ఇక్కడి మున్సిపల్ ఎన్నికలపై పడింది. ఏమైందో ఏమో కానీ ఇంటెలిజెన్స్.. ఇతర సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే నివేదికలు సీఎంవోను షేక్ చేశాయి. ఇంకేముంది సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ రంగంలో దిగి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు.
నిజంగా ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన పనులు చేసి ఉంటే ఏకగ్రీవంగా మున్సిపాటీలు దక్కేవి. అలాకాకుండా కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు కూడా పోటాపోటీ నెలకొన్నది. అధికార పార్టీకి దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులను అన్నిచోట్లా పోటీకి నిలబెట్టింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే విపక్షాలకు అభ్యర్థులు దొరకకుండా అనేక ప్రయత్నాలు చేశారు. ఫలానా వాళ్లు అభ్యర్థులు అవుతారని తెలియడంతో ముందస్తుగానే వారిని లోబరుచుకున్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీగా అన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి దిగారు. అభ్యర్థులపై తక్కువ అంచనా వేసిన అధికార పార్టీకి షాక్ ఇస్తూ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత.. నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేసిందేమీ లేకపోవడంతో చాపకిందనీరులా వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నది. దీంతో సీఎం పీఠం కదులుతుందని భావించిన ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి రంగంలో దిగి ఎన్నికల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతున్నది.
కోస్గి మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డుకు పోటీచేస్తున్న కోనేరు సాయప్ప శనివారం ఉదయం పొలానికి వెళ్లి మోటర్ చాలుచేసి నీళ్లు పెట్టి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఓ కారులో వచ్చిన నలుగురు కాంగ్రెస్ నేతలు అటకాయించారు. వారు కారు దిగుతూనే బూతులు అందుకున్నారు. ‘ కాన్వాసింగ్ ఆపుతావా? లేదా? లేకపోతే నిన్ను చంపేస్తం. ఈ రోజు ప్రచారం చేస్తే రేపు నువ్వు ఉండవు’ అంటూ బెదిరింపులకు దిగారు.
అదే సమయంలో రెండు ద్విచక్రవాహనాలపై అటుగా వచ్చిన స్థానికులు.. వార్డు అభ్యర్థిని అటకాయించింది తెలుసుకొని ఆగారు. దీంతో అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు కారులో పరారయ్యారు. ఈ ఘటనలతో కోస్గి పట్టణంలో అలజడి రేగింది. నాలుగో వార్డు పోటీ చేస్తున్న అభ్యర్థిని ఎత్తుకెళ్లి కాంగ్రెస్లోకి బలవంతంగా చేర్చుకున్న విషయం మరువకముందే.. మరో అభ్యర్థికి వార్నింగ్ ఇవ్వడంతో ఉలిక్కిపడ్డారు.
దమ్మూ ధైర్యం ఉంటే
ప్రాణం పోయినా ప్రచారాన్ని ఆపేది లేదని 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు సాయప్ప స్పష్టంచేశారు. ప్రచారం ఆపాలని వార్నింగ్ ఇవ్వడం సరికాదని అన్నారు. ‘కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేసి బెదిరింపులకు గురిచేస్తున్నరు.. నన్ను ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నరు. కాంగ్రెస్ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో నిలబడి.. పోటీ చేసి గెలువాలి’ అని సవాల్ విసిరారు.
అలాకాకుండా కాంగ్రెస్ నాయకులు కార్లలో వచ్చి బెదిరించి ప్రచారం చేయొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తాను ఎక్కడ ప్రచారం చేసినా కాంగ్రెస్ నాయకులు గుంపుగా వచ్చి ప్రచారం చేయొద్దని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. ఎక్కడపడితే అక్కడ బెదిరిస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. తాను కచ్చితంగా ప్రచారం చేస్తానని, ప్రజల కాళ్లు మొక్కైనా సరే వార్డు సభ్యుడిగా గెలుస్తానని సాయప్ప ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో దేశంలో ఒకే రాజ్యాంగం నడుస్తుంటే.. కొడంగల్లో మాత్రం అనుముల రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యహితంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఎత్తుకెళ్లి బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఎన్నికలను అపహాస్యం చేస్తున్న సీఎం, ఆయన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము లేక అధికార పార్టీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం కూడా సీఎం సోదరుడికే వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికలను శాంతియుత వాతావరణంలో.. స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసే విధంగా చూడాలని కోరారు. తమ అభ్యర్థులకు ఏమైనా జరిగితే సీఎం సోదరుడిదే బాధ్యత అని పేర్కొన్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీకి అనుకూలంగా లేవనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే భయపెట్టో.. బెదిరించో.. ఎలాగో అలా గెలువాలని.. పరువు నిలుపుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నది. ఈ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో కూడా గెలుపు అంతా సులువు కాదని వారికి అర్థమైపోయింది. ఇంటెలిజెన్స్ నివేదికలు.. పార్టీ నేతృత్వంలో చేపట్టిన సర్వేలు కూడా ఇదే విషయాన్ని బయటపెట్టాయి.
ఇక అన్ని వార్డులకు పోటాపోటీ నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఓడిపోతే రాష్ట్రంలో పరువుపోతుందని భావించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈ ఘటనలు రుజువుచేస్తున్నాయి. సీఎం సోదరుడు.. కొడంగల్లో అన్నీ తానై నడిపించే తిరుపతిరెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా సాగుతున్నది. ముఖ్యంగా కోస్గి మున్సిపాలిటీలో ఎలాగైనా గెలువాలని భావించి అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో నాలుగో వార్డు అభ్యర్థిని ఎత్తుకెళ్లి కాంగ్రెస్లో చేర్చుకొని ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితం చేశారు. ఈ ఘటనతో సదరు వార్డు మెంబర్ అభ్యర్థి భయపడి ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఇక 8వ వార్డుపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు గత రెండు, మూడ్రోజులుగా ఫాలో అవుతూ ప్రచారం ఆపాలని.. కాంగ్రెస్లో కలువాలని హెచ్చరికలు జారిచేయడంతో అలజడి రేగింది. మిగతా అభ్యర్థులకు కూడా లోలోపల బెదిరింపులు వస్తున్నాయని బయటికి చెప్పుకోవడం లేదని అంటున్నారు. ఇదిలావుండగా పోటీచేస్తున్న అభ్యర్థులకు రక్షణ లేదని.. ఏ క్షణంలోనైనా అధికార పార్టీ నేతలు దాడి చేసినా పోలీసు యంత్రాంగం న్యాయం చేసే పరిస్థితి లేనందున ఎన్నికల కమిషన్ కోస్గి మున్సిపాలిటీపై దృష్టి పెట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.