సిద్దిపేట, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డికి అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా?.. వేలాదిమంది పోలీసుల బందోబస్తు మధ్య థియేటర్‌కు వెళ్లేందుకు సమయం ఉందిగానీ, నిరుద్యోగులను కలిసే టైం లేదా..? ప్రారంభించే సినిమా థియేటర్ పకనే అశోక్‌నగర్ లైబ్రరీ ఉన్నది. అకడి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడు.. ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావ్.. ఎందుకు ముఖం చూపడం లేదు?’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
లైబ్రరీకి వెళ్లకుండా పారిపోతే నిరుద్యోగులను మోసం చేసినట్టేనని, జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్ చేశారని, ఉద్యోగాల నోటిఫికేషన్లే ఇవ్వలేదు, అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఎలా సాధ్యమని అని మంత్రి శ్రీధర్‌బాబు అనడం హాస్యాస్పదమని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించి, ఇప్పుడు నయవంచన చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి, స్కూటీల కథపై
కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ అస్తవ్యస్తమైందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎవరు కూడా ఇబ్బందులుపడకుండా ఎరువులు ఇంటికే చేరేవని గుర్తుచేశారు. ఎరువులు ఇయ్య చేతకాక యాప్‌లు, మ్యాప్‌లు, కార్డుల కథ పెట్టారని రేవంత్ తీరును ఎండగట్టారు.
సిద్దిపేట దశాబ్దాల కల గోదావరి జలాలను తీర్చింది కేసీఆర్ సర్కారే అని హరీశ్‌రావు చెప్పారు. 2016 -17లో నియోజకవర్గంలో యాసంగి పంట రివ్యూ చేస్తే 8వేల ఎకరాల వరి ఉండే ఇప్పుడు 80 వేల ఎకరాలకు చేరిందని ప్రకటించారు. కాళేశ్వరం నీళ్లు రాకపోతే 80 వేల ఎకరాలు ఎలా పండుతుందని, అలాంటిది కాళేశ్వరం కూలిందంటున్న రేవంత్‌రెడ్డిది నోరా.. మోరా.. అని మండిపడ్డారు. కాళేశ్వరంపై కక్షకట్టి పగబట్టారని రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి, మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే నదీ ప్రవాహం ద్వారా కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించి రైతులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని, కానీ కాంగ్రెస్ సర్కార్ కత్తికట్టిందని దుయ్యబట్టారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించిందని హరీశ్‌రావు చెప్పారు. ఫ్యాక్టరీలో గెలల నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ ఒకవైపు, నట్స్ నుంచి వచ్చే ఆయిల్ ఇంకోవైపు చూస్తుంటే సంతోషంగా ఉందని, దీంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కలలు నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు.
సముద్రతీరానికే పరిమితమైన ఆయిల్‌పామ్ తోటలు ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వ్యాపించాయంటే కేవలం కేసీఆర్ కృషి.. విజన్‌తోనే సాధ్యమైనదని హరీశ్‌రావు చెప్పారు. రైతులకు మేలు కలుగాలనే తపన కేసీఆర్‌ది అని, నీళ్లు, కరెంట్ ఇచ్చి పెట్టుబడి సాయం అందజేసి అధిక ఆదాయం వచ్చే ప్రతి జిల్లాకూ నర్సరీ పెట్టించి, ఫ్యాక్టరీ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం మానేసిందని దుయ్యబట్టారు. రిఫైనరీ, ప్యాకింగ్ అప్పుడే మంజూరు చేస్తే ఆ పనులను కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించలేదని, పనులు తొందరగా చేపట్టాలని మంత్రి తుమ్మలను కోరుతానన్నారు.
దేవుళ్ల మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేసినట్టు మోసం చేశాడని రేవంత్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు విమర్శించారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని, సిద్దిపేట నియోజకవర్గంలోనే 22 వేల మందికి మాఫీ లేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడని, కేసీఆర్ కట్టిన వాటిని ఆయన కత్తిరిస్తున్నాడని, ఉన్న పనులను ఆపుతున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు.
రేవంత్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోబోమని హరీశ్ హెచ్చరించారు. కోపం ఉంటే తనతోనే చూసుకోవాలని, సిద్దిపేట ప్రజలపై చూపొద్దని హితవు పలికారు. 40 ఏండ్ల సిద్దిపేట ప్రజల జిల్లా కలను కేసీఆర్ నిజం చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి జిల్లాలు ఎకువయ్యాయని సాకుచూపి రద్దు చేసి సంగారెడ్డిలో కలుపాలని కుట్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ కుట్రలను అడ్డుకుని సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటామన్నారు.
కొంతమంది కాంగ్రెస్ నేతలు నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సిద్ధమయ్యాక మూర్ఖంగా తామే చేశామని మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. తాము ఎంత కష్టపడ్డమో తెల్వదా అని సూటిగా ప్రశ్నించారు. అప్పట్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆయిల్ పామ్ తోటలో భోజనం పెడితే చూసి తనకు ఆలోచన వచ్చి సిద్దిపేటలో ఆ తోటలు ఎందుకు పెట్టొద్దని కష్టపడి తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు.
సిద్దిపేట రైతులకు అధిక ఆదాయం దక్కాలనే తాపత్రయంతో ఈ పని చేశామని, 2021 జనవరిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వారు సిద్దిపేటకు సూట్ అవుతుందని చెప్పడంతో కేసీఆర్‌ను కలిసి పామాయిల్ తోటలు పెంచడానికి అవకాశం ఇవ్వాలని కోరినట్టు గుర్తు చేశారు. మొదటి మొక్క మార్చి 2021లో పెడితే ఏప్రిల్ 2022లో 300 కోట్లతో ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేశామని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3,500 టన్నుల గెలలు క్రషింగ్ చేశామని, దాదాపు 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్, 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి అయ్యిందని చెప్పారు.