ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో వెయ్యి టీఎంసీల వరకు నీళ్లొచ్చాయి. 66:34 నిష్పత్తిలో ఏపీ 690 టీఎంసీలు, తెలంగాణ 332 టీఎంసీలు వాడుకోవాలి. ఏపీ ఇప్పటికే 630 టీఎంసీలు (82% కోటా) వినియోగించుకున్నది. కానీ తెలంగాణ వాడుకున్నది 120 టీఎంసీలే. అంటే కోటాలో 18% మాత్రమే. ఇంకా 212 టీఎంసీలు వినియోగించుకోకుండా మిగిలే ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే మరో 40-50 టీఎంసీలు తెలంగాణ వాడుకోగలిగేది.
శ్రీశైలం నుంచి తెలంగాణ ఈ ఏడాది వినియోగించుకున్నది కేవలం 14 టీఎంసీలు. ఇదే సమయంలో ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే ఏపీ 200 టీఎంసీలను మళ్లించుకుపోయింది. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా మరో 40 టీఎంసీలు తీసుకెళ్లింది. అంటే ఒక్క శ్రీశైలం నుంచే 240 టీఎంసీల కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తన్నుకుపోయింది. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యుంటే ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట పడేది.
‘పాలమూరు’ను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్‌ను తెరపైకి తెచ్చింది. పోనీ దానికైనా కొత్తగా శ్రీశైలం నుంచి నీటి కేటాయింపులు చేసిందా? అంటే అదీ లేదు. భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల నీటిలో 7.33 టీఎంసీలు కోత పెట్టింది. అందులో 7.11 టీఎంసీలను నారాయణపేట-కొడంగల్‌కు కేటాయించింది. అంటే కొత్తగా ఒక్క చుక్క కూడా నీటిని ఎత్తిపోయకుండా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు కోటాకు కోతపెట్టింది. ఇప్పటికే ముక్కీమూలుగుతున్న జూరాలపై అదనపు భారం మోపింది. దీనిని తెలంగాణపై జలకుట్ర కాదని, ఏపీకి నీళ్లను దోచిపెట్టే కుతంత్రం కాదని ఎవరైనా అనగలరా?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని తొలుత అంజనాగిరి (నార్లాపూర్) రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు, తర్వాత వట్టెం, కరివెనకు తరలించాల్సి ఉంటుంది. రిజర్వాయర్లు, కాలువలు పూర్తయ్యాయి. నార్లాపూర్- ఏదుల మార్గంలో 800 మీటర్ల మేర రాయి తొలగింపు పనులు రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే కృష్ణా జలాలను ఏపీ తన్నుకుపోయేందుకు సహకరిస్తున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువలను రద్దుచేసింది. రెండేండ్లుగా ప్రాజెక్టులోని ఏ ఒక్క పనిని కూడా చేయడం లేదు. నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఆ వైపు కన్నెత్తి చూడటమే లేదు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలను సైతం 45 టీఎంసీలకే పరిమితం చేసి తీరని విద్రోహాన్ని తలపెట్టింది. ఉమ్మడి ఏపీ ప్రణాళికలకు అనుగుణంగా కొత్త లిఫ్ట్ స్కీమ్‌కు శ్రీకారం చుట్టి జూరాలపై మరో పెనుభారాన్ని మోపింది. ఇదే సమయంలో ఏపీ మాత్రం రెండేండ్లుగా విచ్చలవిడిగా జలదోపిడీకి పాల్పడుతున్నదని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోటాకు మించి గుట్టుచప్పుడు కాకుండా నీళ్లను తరలిస్తున్నారని పేర్కొంటున్నారు.
బృహత్తర లక్ష్యంతో భారీ ప్రాజెక్టు
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) తెలంగాణ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలయ్యాయి. మొదటి దశలో తాగునీటి పనులను, రెండో దశలో సాగునీటి పనులను పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు ఏపీతోపాటు స్వరాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు అనేక అడ్డంకులు సృష్టించారు. ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైనా కుట్రలకు పాల్పడ్డారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించి, ఎప్పటికప్పుడు ఆ కుట్రలను తిప్పికొడుతూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది.
నాగర్‌కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టు పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించింది. అందులో 18 ప్యాకేజీల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత చేపట్టింది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటికుంటలు, చెరువులను నింపి, తద్వారా 1,226 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో మొదటిదశ తాగునీటి పనులను చేపట్టింది.
ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను 2 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తొలుత హెడ్‌రెగ్యులేటర్‌కు, అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడి నుంచి 8 పంపుల ద్వారా 104 మీటర్లపైన ఉన్న అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం ద్వారా ఏదులా పంప్‌హౌస్‌కు జలాలను తరలిస్తారు. అక్కడ 9 మోటర్ల ద్వారా 124 మీటర్లపైకి వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ సొరంగాల ద్వారా నీటిని వట్టెం పంప్‌హౌజ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి 9 మోటర్ల ద్వారా 121 మీటర్లపైకి వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్‌లోకి జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా కురుమూర్తి (కరివెన) రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అనంతరం కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 8.5 కిలోమీటర్లతో నిర్మించిన సొరంగాల ద్వారా జలాలను ఉద్దండాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడ 5 మోటర్ల ద్వారా 122 మీటర్లపై జలాలను ఎత్తి ఉద్దండాపూర్ రిజర్వాయర్‌లోకి జలాలను తరలిస్తారు.
బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయేనాటికి నార్లాపూర్-ఏదులకు నీటిసరఫరా చేసే 8 కిలోమీటర్ల ప్రధాన కాలువలో కేవలం 2 కిలోమీటర్ల పనులే పెండింగ్‌లో ఉన్నాయి. కాలువ మార్గంలో పెద్దబండరాళ్లు ఉండటంతో కంట్రోల్ బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇందుకు అంచనాలను సవరించాల్సి ఉన్నది. ఆ మేరకు సర్కార్ ప్రతిపాదనలు పంపగా, కాంగ్రెస్ సర్కార్ 6 నెలల క్రితం వరకు వాటిని పెండింగ్‌లో పెట్టింది. ఫలితంగా ఆ పని పెండింగ్‌లో పడిపోయింది. ఉద్దండాపూర్ రిజర్వాయర్, పంపుహౌస్ పనులు సైతం నత్తనడకనే కొనసాగుతున్నాయి.
టెండర్లు రద్దు..రెండేండ్లుగా పనులు పెండింగ్
తాగునీటి సరఫరా పనులన్నీ తుదిదశకు చేరుకోవడం, పర్యావరణ అనుమతులకు పర్యావరణ మంత్రిత్వశాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) సిఫారసు చేయడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే సాగునీటి కాలువల పనులకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా ప్రాజెక్టు పరిధిలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉన్నది. ఇందుకోసం మొత్తంగా 915 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. ప్రాజెక్టులో ప్రధానంగా వెంకటాద్రి రిజర్వాయర్ నుంచే ఆయకట్టు ప్రారంభం కానుండగా, సింహభాగం దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉద్దండాపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్నది. ఇందుకు సంబంధించి కాలువల నిర్మాణానికి సంబంధించి మొత్తంగా 15,515 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్ నుంచి 149 కిలోమీటర్ల పొడవుతో హైలెవల్ కెనాల్‌ను, 28.96 కిలోమీటర్ల పొడవుతో లో లెవల్ కెనాల్‌ను నిర్మించాల్సి ఉన్నది. ఆ పనులను మొత్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.454.56 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది.
లో లెవల్ కెనాల్ ద్వారా 16 వేల ఎకరాలకు, హైలెవల్ కెనాల్ ద్వారా 1.17 లక్షల ఎకరాలకు మొత్తంగా రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటుగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందాల్సి ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టులో నిర్మించిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 4.6 కిలోమీటర్ల పొడవుతో రైట్ కెనాల్ -1, దాదాపు 100 కిలోమీటర్ల పొడవుతో రైట్కెనాల్-2ను, 122 కిలోమీటర్ల పొడవుతో ఎడమ ప్రధాన కాలువ, 90 కిలోమీటర్ల పొడవుతో మద్దూర్ కెనాల్, 24 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ కెనాల్‌ను నిర్మించాల్సి ఉన్నది. అందుకు సంబంధించి రూ.5,600 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వాయర్ నుంచి 122 కిలోమీటర్ల పొడవుతో వికారాబాద్ వరకు ఎడమ కాలువను తవ్వాల్సి ఉండగా, 3 ప్యాకేజీలుగా విభజించి రూ.1,469 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా అధికారులు పిలిచారు. కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 103 కిలోమీటర్ల పొడవుతో హైలెవల్ ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా, దాని కింద మొత్తంగా 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ పనులను చేపట్టేందుకు సైతం అధికారులు కసరత్తు చేశారు. అందులో పలు టెండర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారపగ్గాలను చేపట్టి నెలరోజులు తిరుగకముందే 2024 జనవరి 6వ తేదీన ఆయా కాలువల టెండర్లను రద్దు చేశారు. ఇప్పటికీ ఆ పనుల టెండర్లను కాంగ్రెస్ సర్కారు మళ్లీ ఖరారు చేయనేలేదు.
10 కోట్లు కూడా ఇవ్వని సర్కారు
పీఆర్ఎల్ఐఎస్ సీమ్‌లో మొత్తంగా 4 పంపింగ్ స్టేషన్లు ఉండగా, ఉద్దండాపూర్ మినహా 3 ఇప్పటికే సిద్ధమయ్యాయి. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లో 8, ఏదుల పంపింగ్ స్టేషన్లో 9, వట్టెం పంపింగ్స్టేషన్లో 9 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఒక్కో పంపుహౌస్‌లో ఇప్పటికే 5 చొప్పున పంపులను అమర్చారు. పంపింగ్ స్టేషన్-1 (నార్లాపూర్)లో 2 పంపుల వెట్న్‌న్రు కేసీఆర్ విజయవంతంగా 2023 సెప్టెంబర్‌లోనే నిర్వహించారు. నార్లాపూర్‌లో మిగిలిన 3 పంపుల, ఏదుల, వట్టెం పంపులను డ్రైరన్, వెట్న్ కోసం అధికారులు సిద్ధం చేశారు.
అయితే ఆయా పంపింగ్ స్టేషన్లకు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆ ప్రక్రియను చేపట్టడం లేదు. వాస్తవంగా మోటర్ల పనితీరును పరీక్షించేందుకు, విడిభాగాలను సంరక్షించేందుకు, పంపులను తిప్పిచూడటం పరిపాటి. అందుకు డ్రైరన్ నిర్వహించాల్సి ఉన్నది. అందులో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి, వాటి మరమ్మతులను మోటర్లను సరఫరా చేసిన ఏజెన్సీలతోనే చేయించాల్సి ఉంటుంది. అన్నీ సిద్ధమైన తర్వాత పంపులు వెట్న్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటర్ల అమరిక పూర్తయినా డ్రైరన్‌కు అధికారులకు నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. అదీగాక 2024 వానకాలంలో వట్టెం పంప్‌హౌస్‌ను వరదనీరు ముంచెత్తింది. దీంతో అప్పటికే సిద్ధం చేసిన 4 పంపులు నీట మునిగాయి. ప్రస్తుతం అందులో రెండు పంపులను ఇటీవలే అధికారులు పునరుద్ధరించారు.
ఆ పంపుల పనితీరును కూడా పరిశీలించాల్సి ఉన్నది. ప్రాజెక్టులోని అన్ని పంపింగ్స్టేషన్లకు విద్యుత్తు శాఖ పవర్ సర్వీస్ కనెక్షన్‌ను తొలగించింది. దాదాపు రూ.500 కోట్ల మేరకు బకాయి బిల్లులను చెల్లిస్తేనే విద్యుత్తు కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని ఎస్పీడీసీఎల్, టీఎస్ ట్రాన్స్‌కో తేల్చిచెప్పాయి. ఆ మేరకు బిల్లులను చెల్లించాలని ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం ప్రభుత్వానికి రెండేండ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. సర్వీస్ కనెక్షన్ చార్జీలు చెల్లించాలని, మోటర్లను తిప్పిచూడాల్సి ఉన్నదని అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం బిల్లులను చెల్లించేందుకు ససేమిరా అంటున్నదని అధికారులు వాపోతున్నారు. పంపుల పనితీరును పరిశీలించాల్సి ఉన్నదని చెప్పినా సర్కార్ ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పంపులను సరఫరా చేసిన ఏజెన్సీల అగ్రిమెంట్ పూర్తికాక ముందే డ్రైరన్, వెట్న్ నిర్వహించాల్సి ఉంటుందని, అప్పుడే ఏవైనా లోపాలు తలెత్తినా, మరమ్మతులు చేయాల్సి ఉన్నా సదరు ఏజెన్సీతోనే చేయించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వెంటనే ట్రాన్స్‌కోకు నిధులు చెల్లించి పంపింగ్ స్టేషన్లకు సర్వీస్ కనెక్షన్ ఇప్పించాలని అధికార వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ట్రాన్స్‌కో అధికారులు కనీసం రూ.10 కోట్ల నిధులు చెల్లించినా కనెక్షన్ ఇస్తామని చెప్తున్నా, కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోని దుస్థితి. స్వయంగా ఓ మంత్రికి ఈ విషయాన్ని వివరించినా పట్టించుకోవడం లేదని అధికారులే చెప్తున్నారు. దీనిని బట్టే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏరీతిన నిర్లక్ష్యం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
కేటాయింపు జలాల్లో కోతలు
పీఆర్ఎల్ఐఎస్ పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. మరోవైపు ఇప్పటికే కేటాయించిన జలాల్లోనూ కోతలు విధిస్తున్నది. తెలంగాణ ఉద్యమానికి జడిసి రాజీవ్ భీమా ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు 20 టీఎంసీలను కంటితుడుపుగా కేటాయించారు. ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలకు నీరందించేలా మొత్తంగా 2.03 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించారు. కానీ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రాజెక్టు పనులేమీ పూర్తికాలేదు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ పనులను పూర్తిచేసింది. ప్రస్తుతం భీమా ప్రాజెక్టు కింద 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇంకా 40 వేల ఆయకట్టుకు నీరందించే పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కింద పూర్తిస్థాయి సాగునీరు అందించక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం తలపెట్టింది. భీమా ప్రాజెక్టు డ్యూటీని (1 టీఎంసీకి సాగయ్యే భూమి) 10 వేల ఎకరాల నుంచి 15 వేలకు పెంచింది. తద్వారా 20 టీఎంసీల కేటాయింపుల్లో 7.33 టీఎంసీల నీటిని సేవింగ్స్ కింద చూపించి, కోత విధించింది. కేవలం 12.67 టీఎంసీల నీటితోనే 2 లక్షల ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చని నిర్ధారించింది.

భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు చెందాల్సిన 7.33 టీఎంసీల జలాల్లో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేటాయించింది. ఈ ప్రాజెక్టుకైనా శ్రీశైలం నుంచి కొత్తగా పంపులను ఏర్పాటు చేస్తున్నదా? అంటే అదీ లేదు. భీమాలో భాగంగా నిర్మించిన భూత్పూర్ నుంచే నీళ్లను వాడుకోవాలని నిర్ణయించి భారీ ద్రోహం తలపెట్టింది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుపై 5.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉండగా, అదనంగా మరో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు భారాన్ని మోపింది. దీంతో జూరాల ద్వారా వానాకాలం పంటకే నీరందించలేని దుస్థితి కల్పించింది. అదీగాక ప్రాజెక్టు కింద సాగునీటితోపాటు మిషన్ భగీరథ కేటాయింపులు కూడా ఉన్నాయి. పీఆర్ఎల్ఐఎస్కు గత బీఆర్ఎస్ సర్కారు 90 టీఎంసీలను కేటాయించగా, దానిని సైతం 45 టీఎంసీలకు కుదించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. దీంతోనే పాలమూరుకు తీరని విద్రోహాన్ని తలపెట్టింది.
పాలమూరు పూర్తి చేసుంటే..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏపీ జలదోపిడీకి బాటలు పరుస్తున్నదని నిపుణులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పడావు పెట్టింది. ఒకవేళ పూర్తిచేసి ఉంటే ఇప్పటికిప్పుడు అదనంగా మరో 40 టీఎంసీల వరకు వినియోగించుకునే అవకాశం ఉండేదని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. శ్రీశైలం నుంచి జలాలను ఎత్తి ఆయా రిజర్వాయర్లలో నిల్వ చేసుకునే అవకాశం దక్కేదన్నారు. అదీగాక ఏదుల నుంచి కల్వకుర్తి కాలువలను గతంలోనే లింకు చేశారు. కల్వకుర్తి ఆయకట్టుకు సైతం అదనంగా జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. కానీ ప్రభుత్వం పనులను పూర్తిచేయకపోవడంతో తెలంగాణ తన కోటా నీటిని కూడా వినియోగించుకోలేక అవస్థలు పడుతుంటే.. ఏపీ మాత్రం నీళ్ల పండుగ చేసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగించుకునే అవకాశమున్నా..
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగంగా 0.25 టీఎంసీతో 345 మీటర్ల ఎత్తులో ఎల్లూర్ రిజర్వాయర్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. పీఆర్ఎల్ఐఎస్ స్కీమ్‌లో భాగంగా ఈ రిజర్వాయర్‌ను ఆనుకుని, దానికి సమాంతరంగా అదే లెవల్లో అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్ నిర్మించారు. అంతేకాదు 2 రిజర్వాయర్లను కూడా అనుసంధానించారు. 345 లెవల్ వల్ల రెండు రిజర్వాయర్లలో ఒకే స్థాయిలో జలాలు ఉండనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే నార్లాపూర్ పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తీసుకొస్తే కల్వకుర్తి లిఫ్ట్‌లతో పనిలేకుండానే ఎల్లూరు రిజర్వాయర్‌ను నింపుకొనే వెసులుబాటు కూడా ఉన్నది. తద్వారా తాగునీటికి కొరత లేకుండా చూడవచ్చని, కల్వకుర్తిలో పంపులను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెప్తున్నారు. అయితే విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో నార్లాపూర్ పంప్‌హౌస్ పనిచేయని పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు నార్లాపూర్ -ఏదుల రిజర్వాయర్ లింకులో 2 కిలోమీటర్ల పెండింగ్ కెనాల్‌ను పూర్తిచేస్తే కరివెన వరకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉన్నది. ఆయా రిజర్వాయర్లలో నీళ్లను నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగేది. ఫలితంగా వాటి పరిధిలో భూగర్భజలాల పెంపునకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరిస్తున్నది.
శ్రీశైలం నీటిని తరలించుకుపోతున్న ఏపీ
శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు భారీ ప్రాజెక్టులు లేకపోవడం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పడకేయడంతో ఏపీ పండుగ చేసుకుంటున్నది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మళ్లించుకుపోతున్నది. పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నది. జలదోపిడీని నిలువరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నది.
ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. కాగా జూరాల, శ్రీశైలం, సాగర్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. మొత్తంగా 1045 టీఎంసీలు రాగా అందులో ఈ ఏడాది నీటి సంవత్సరం కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందం 66:34 నిష్పత్తి ప్రకారం నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నది. కానీ ఈ నీటి సంవత్సరం ఇంకా 5 నెలలు మిగిలి ఉండగానే ఏపీ ఇప్పటికే తన కోటాలో 82 శాతం జలాలను దాదాపు 630 టీఎంసీలను వినియోగించుకున్నది.
ఏపీ కోటాలో ఇంకా మిగిలి ఉన్నది 60 టీంఎసీలు మాత్రమే. ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే ఈ ఏడాది 200 టీఎంసీలను మళ్లించుకుపోయింది. పెన్నా బేసిన్లో నిల్వ చేసుకున్నది. హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీనీవా సుజల స్రవంతి) ద్వారా మరో 40 టీఎంసీలు.. మొత్తంగా శ్రీశైలం నుంచే 240 టీఎంసీల కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తన్నుకుపోయింది. సాగర్ నుంచి మరో 130 టీఎంసీలను పట్టుకుపోయింది. తెలంగాణ తన కోటాలో ఇప్పటికీ 18 శాతం అంటే 120 టీఎంసీలనే వినియోగించుకున్నది. రాష్ట్ర కోటాలో ఇంకా 212 టీఎంసీలు వినియోగించుకోకుండా మిగిలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ మాత్రం శ్రీశైలం నుంచి కేవలం 14 టీఎంసీలనే వినియోగించుకోవడం గమనార్హం. సాగర్ నుంచి కూడా 62 టీఎంసీలే వినియోగించుకున్నది.
