హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా.. లేనోళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నది. రైతుకూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి రెం డున్నరేండ్లయినా అరకొర తప్ప పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. 2024-25 బడ్జెట్లో రూ.6వేల కోట్లు కేటాయించి నయాపైసా విదిల్చలేదు. 2025-26 బడ్జెట్లోనూ 6వేల కోట్లు కేటాయించి రూ.50కోట్లు ఖర్చుచేసి చేతులు దులుపుకొన్నది. తాజా బడ్జెట్లోనూ ఎప్పటిలాగే రూ.6వేల కోట్లు కేటాయించినా ఇప్పటివరకు అమలుదిశగా అడుగులు పడలేదు. మార్గదర్శకాలు విడుదల చేయకుండా, అర్హుల గుర్తింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.
ఉపాధి హామీ జాబ్‌కార్డులు కలిగి భూమిలేని 22లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికి అమలుకు ఉపక్రమించారు. 2025 జనవరి 26న ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఘనంగా ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.6వేలు కోట్లు కేటాయించిన నిధులను విడుదల చేస్తామని ఊదరగొట్టారు. నిబంధనల పేరిట అర్హులను సగానికి సగం 11లక్షలకు తగ్గించారు. చివరకు 5,19,191 మంది ఉన్నట్టు తేల్చారు. ఇందులో మొదటి విడత 83,887మంది రైతుకూలీల ఖాతాల్లో కేవలం రూ.6వేల చొప్పున మొత్తంగా రూ. 50.65 కోట్లు జమచేశారు. మిగిలిన 4,35,304 మందికి రెండో విడుత కింద రూ.261 కోట్లు విడుదల చేస్తున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ తీరా నిధులలేమి సాకుతో చేతులెత్తేశారు.
నిరుడు మొక్కుబడిగా ఆత్మీయ భరోసాను అమలుచేసిన ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ రూ.6వేల కోట్లు ప్రతిపాదించింది. వాస్తవానికి ఈ నిధులతో సుమారు 50లక్షల మందికి రూ.12వేల చొప్పున జమచేయవచ్చు. కానీ అంకెల గారడీతో మాయచేసింది. నిరుడు కేవలం 5.20 లక్షల మందిని మాత్రమే అర్హులను గుర్తించింది. ఇందులో కేవలం 20శాతం మందికే అది కూడా ఒకే విడుత అందించింది. కానీ ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అయితే గతంలో గుర్తించిన అర్హులకే అందజేస్తుందా? లేకపోతే మళ్లీ అర్హులను గుర్తిస్తుందా? అదేవిధంగా నిరుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న 2.24 లక్షల మందిలో ఎంతమందికి వర్తింపజేస్తారు? అనే విషయాలపై ప్రభ్తువం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో నిధుల సాకును చూపి అసలు ఆత్మీయ భరోసాను అటకెక్కిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.