భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ ఓటర్లు అధికార కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పారు. శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. భద్రాద్రి, మంచిర్యాల జిల్లాల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కూటమికే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో పొత్తులో ఉన్న కాంగ్రెస్, సీపీఐ పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో మేయర్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది. ఈ రెండు పార్టీలకు మేయర్ కావాలంటే బీఆర్ఎస్ గెలిచిన సీట్లు కీలకం కావడంతో చేసేదేమీ లేక కాంగ్రెస్ పార్టీ సీపీఐ పంచన చేరాల్సి వస్తున్నది. కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు 22, సీపీఐ 22, బీఆర్ఎస్కు 8, ఇతరులకు 8 స్థానాలు వచ్చాయి.
60 స్థానాలు ఉన్న కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కేవలం 22 స్థానాలు మాత్రమే రావడం, మ్యాజిక్ ఫిగర్ అయిన 31 స్థానాలకు చేరుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టంచేస్తున్నాయి. కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో సింగరేణి ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బతో సీపీఐతో కలిసి పనిచేయాలనే నిర్ణయించింది. కొత్తగూడెంలో 22 స్థానాలు గెలుచుకున్న సీపీఐకి 8 స్థానాలు గెలుచుకున్న తాము మద్దతు ఇస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
సింగరేణిని కాంగ్రెస్ హయాంలో ప్రైవేట్‌పరం చేయడం సహా నైనీతోపాటు భద్రాద్రి జిల్లాలోని ఓసీలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో కార్మికుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉపాధి అవకాశాలు భారీగా తగ్గే ప్రమాదాలు కన్పిస్తున్నాయి. అదేకాకుండా ఏకంగా కాంగ్రెస్ పెద్దలే ఇటీవలి బొగ్గు స్కామ్‌లో పాల్గొనడం, వారి అవినీతి బయటపడటంతో కార్మికుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత నెలకొన్నది. అదే అదును అనుకున్న సింగరేణి కార్మికులు, ఆ ప్రాంత ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో తగిన బుద్ధి చెప్పారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ కూటమి 14 వార్డులు దక్కించుకోగా కాంగ్రెస్ 4వార్డులకే పరిమితమైంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌కు అదే పరిస్థితి. 34 వార్డుల్లో బీఆర్ఎస్ 14 గెలిచింది. అక్కడ కూడా కాంగ్రెస్ ఎదురీదాల్సి వచ్చింది. కొన్నిచోట్ల డబ్బులు వెదజల్లి సీట్లు దక్కించుకున్నది. కానీ సింగరేణి ప్రాంతంలో ఎక్కడా అధికార పార్టీ తన సత్తా చాటలేకపోయింది.