ఖైరతాబాద్, అక్టోబర్ 16: ‘హైకోర్టు స్టే ఇచ్చింది.. సుప్రీంకోర్టులో కేసు తేలిపోయింది.. ఇక ఉద్యమమే మిగిలింది. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలు ఒక్కటవ్వాలి. పోరుబాట పట్టాలి’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సీనియర్ జర్నలిస్టు ఏ రమణకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 18న జరిగే బీసీ రాష్ట్ర బంద్ దేశంలోనే కొత్త అధ్యయనానికి నాంది పలకాలని, దేశానికే ఒక సందేశం ఇవ్వాలని స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలుకాల్సిన సమయం ఆసన్నమైందని, వ్యవస్థలన్నీ బీసీలకు వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో భూకంపం సృష్టించి వాటిని కదిలిస్తామని స్పష్టంచేశారు. 75 ఏండ్లు పోరాడి రిజర్వేషన్లు సాధించుకునే సమయంలో రెడ్డి జాగృతి కేసు వేసి అడ్డుకున్నదని, బీసీల నోటికాడి ముద్దను లాక్కునేందుకు కుట్రపన్నిందని ధ్వజమెత్తారు. బీసీలంతా ఐక్యంగా పోరాడితే రాజ్యాంగ సవరణ చేయక తప్పదని, 9వ షెడ్యూల్లో చేరిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు.
బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో బీసీలు అధికసంఖ్యలో పాల్గొనాలని, విద్య, వ్యాపార వాణిజ్య రంగాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక మాత్రమేనని, బీసీల డిమాండ్లు పరిష్కరించకపోతే.. తర్వాత అగ్రవర్ణాలకు ఓట్ల బంద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఓబీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోదీ బీసీ బిల్లుకు ఎందుకు ఆమోద ముద్రవేయడం లేదని, దీనిపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు పార్లమెంట్లో ప్రశ్నించడం లేదని జాజుల ప్రశ్నించారు. దీంతో వారు బీసీ వ్యతిరేకులేనని భావిస్తామని తేల్చి చెప్పారు.
రాజ్యాంగం అమలై 75 ఏండ్లు అవుతున్నా బీసీలు ఇంకా తమ హక్కుల కోసం పోరాడాల్సి పరిస్థితి నెలకొన్నదని బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారాం యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో బీసీ నేత ప్రతాని రామకృష్ణగౌడ్, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేశ్, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, మున్నూరుకాపు సం ఘం అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్, బీసీ జర్నలిస్టు అసోసియేషన్ ప్రతినిధులు నీలకంఠం ముదిరాజ్, కొత్త లక్ష్మణ్ పటేల్, మేకల కృష్ణయాదవ్, సుంకరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీసీ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నేతలు రచ్చ చేశారు. బీసీ జేఏసీలో తమకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను, ఇతర నేతలను బీజేపీకి చెందిన రాజు, మణికంఠ ప్రశ్నించారు. ఓ దశలో వారిపై చేయిచేసుకునే యత్నించారు. అరగంట సేపు హల్చల్ చేశారు. ఇదిలా ఉండగా, రాజు, మణికంఠ ఇద్దరూ సమావేశ అనంతరం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కారులోనే వెళ్లడం వెనుక ఉన్న మతలబు ఏమిటని బీసీ జర్నలిస్టులు అనుమానం వ్యక్తంచేశారు.