హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ : బీసీలకు రాజకీయ రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కుట్రలు చేస్తున్నదని శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆ పార్టీ ముమ్మాటికీ బీసీల పాలిట ద్రోహి అని ధ్వజమెత్తారు. తెలంగాణ బీసీల గోడును ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కండ్లుంటే చూడాలని, చెవులుంటే వినాలని హితవు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ధర్మ పోరాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీలు ప్రదర్శన నిర్వహించారు. జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మధుసూదనాచారితోపాటు ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ రుషిఅరుణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రూరమైన అణచివేత చర్యలకు రేవంత్ సర్కార్ పాల్పడుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ డిక్లరేషన్లకు భిన్నంగా తెలంగాణలో తడిగుడ్డతో బీసీల గొంతు కోసే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు ప్రత్యేక తెలంగాణ విషయంలో, నేడు బీసీ కోటా అమల్లో కాంగ్రెస్ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం జాతి నినదిస్తే 1,300 మంది ఆత్మాహుతి చేసుకుంటే గానీ తెలంగాణ ఇవ్వని ద్రోహులు, పాపాత్ముల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. అదే పార్టీ ఈ రోజు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, తీరా ఎన్నికల్లో 17శాతమే ఇచ్చి దగా చేసిందని విమర్శించారు. బీసీల ఓట్లను కొల్లగొట్టి వారిని మభ్యపెట్టి నమ్మించడమే ఏకైక మార్గంగా ఎంచుకొని 42 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చిందని ఆరోపించారు. రెండేండ్లపాటు బీసీలకు ఆశలు కల్పిస్తూ సర్కారు డ్రామా నడిపిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనిది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుందని నిలదీశారు. రేవంత్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవానికి, మనోభావాలకు భంగం కలిగిస్తూ, ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని, బీసీ కోటా అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ల అమలుకోసం రాష్ట్ర అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలవాలి. లేదంటే బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలోని ఏఐసీసీ భవన్ ఎదుట ధర్నాకు దిగుతాం’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, రిజర్వేషన్ల శాతం తగ్గిందని, వెంటనే ఎన్నికలు వాయిదా వేసి వాటిని సరిదిద్దాలని బీసీ కమిషన్ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత ఇక నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీలకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ సర్కార్ నైజమని మండిపడ్డారు. చట్టసభలు, హైకోర్టు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో పాలన కొనసాగిస్తుందని వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆరోపించారు. ప్రజాపాలన కొనసాగిస్తున్నామని గొప్పలు చెప్పకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ బీసీ ప్రజల ప్రయోజనాలను కాలరాయడమే ప్రజారంజకమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నీల వెంకటేశ్, గుజ్జ సత్యం, బాణాల అజయ్, అనంతయ్య, రాజ్‌కుమార్, భీంరాజ్, ఆశీశ్గౌడ్, నిఖిల్‌పటేల్, మేణుమాధవ్, బాలస్వామి, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.