Telangana | హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. మ్యానిఫెస్టోలోనూ ఏ పంటకు ఎంత బోనస్ ఇస్తామో తెలియజేస్తూ పట్టిక ప్రచురించింది. కానీ, అధికారంలోకి వచ్చాక బోనస్‌ను అటకెక్కించింది. బోనస్ ఇవ్వకుండానే పలు పంటలను కొనుగోలు చేస్తున్నది. సర్కారు తీరుతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
తాము అధికారంలోకి వస్తే పది పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. చివరకు ఒకే ఒక్క పంటకు పరిమితం చేసింది. అది కూడా కొర్రీలతో. వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. ప్రస్తుతం సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పంటల ధర పడిపోయింది. దీంతో మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, పత్తి, కందులు, మొక్కజొన్న, జొన్న పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉండటం గమనార్హం. కేంద్రం మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా ఇచ్చిన హామీ మేరకు ఆ పంటలకు బోనస్‌ను అదనంగా రైతులకు చెల్లించాలి. కానీ, రైతులకు మద్దతు ధర ఇవ్వడమే ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.