Sampath Kumar | హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన సొంత తమ్ముడు జగదీశ్వర్‌రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆయనకు స్వచ్ఛ్ బయో కంపెనీ ఉందని, అ కంపెనీ ప్రారంభమై పదైదు నెలలు కూడా కాలేదని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంకా ఏబీసీడీ కూడా మొదలు కాలేదని, పెట్టుబడులు రానేలేదని తెలిపారు. వాళ్లే వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతా అన్నారే తప్పా.. తెలంగాణ ఆస్తి మొత్తాన్ని దోచుకుంటామని అనలేదని పేర్కొన్నారు. దీనికి లేనిపోని అభూత కల్పనలు జోడించి సొంత తమ్ముడు కూడా ఉండకూడదనే విధంగా కుట్ర పూరిత ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. మరో తమ్ముడు కొండల్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనపైనా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది అధికారిక కార్యక్రమం కాదని, అయినప్పటికీ ఆ చైర్లో కూర్చుకున్నారు, ఈ చైర్లో కూర్చున్నారని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడంగల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి మీటింగ్ పాల్గొనడం సర్వ సాధారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా బరాబర్ పాల్గొంటారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 8 నెలల్లో ఒక్కరోజైనా, ఒక్క చోటైనా సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరులను ఇన్వాల్వ్ చేసినట్టు చూపితే అన్నింటికీ బాధ్యత వహిస్తా అని సవాల్ విసిరారు.