బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, వారం రోజుల్లో పాస్‌బుక్ నేరుగా రైతు ఇంటికి వచ్చేది. కానీ, ఇప్పుడు భూభారతి వచ్చాక రిజిస్ట్రేషన్ సమయంలో పాస్‌బుక్ ఫీజు కింద రూ.300 వసూలు చేస్తున్నారు. కానీ, ఆరు నెలలైనా పాస్‌బుక్‌లు ఇవ్వడం లేదు.
– హరీశ్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 26: భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు. గురువారం ఆయన సిద్దిపేట అర్బన్ తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయం వద్ద తమ పనుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. భూభారతి తీసుకొచ్చాక ప్రభుత్వం ని ర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8,68,000 దరఖాస్తులు వస్తే, వాటిలో ఒక్కటి కూడా పరిష్కరించలేదని మండిపడ్డారు.
ఆయా దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారా? పాత కాగితాల కింద అమ్ముకున్నారా? అని ప్రశ్నించారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, మ్యుటేషన్ సహా కేవలం వారం రోజుల్లో పాస్‌బుక్ నేరుగా రైతు ఇంటికి వచ్చేదని, ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండేదికాదని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు భూభారతి వచ్చాక రిజిస్ట్రేషన్ సమయంలో పాస్‌బుక్ ఫీజు కింద రూ.300 వసూలు చేస్తున్నారని, కానీ, ఆరు నెలలైనా పాస్‌బుక్‌లు ఇవ్వడం లేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 6,20,000 మంది రైతులకు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేసి సాదా బైనామాకు పాస్‌బుక్‌లు ఇచ్చామని హరీశ్‌రావు గుర్తుచేశారు. రెండో విడత కింద 9,26,000 అప్లికేషన్లు వస్తే, ఆనాడు కోర్టు స్టే వల్ల ఆగిపోయాయని వివరించారు. కాంగ్రెస్ వచ్చాక కోర్టు స్టే ఎత్తివేసినా, కావాలనే సాదా బైనామా అమలు చేయడం లేదని విమర్శించారు. భూమి అమ్మిన వ్యక్తి స్టాంప్‌పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే కొత్త నిబంధన తెచ్చి, సాదా బైనామాకు ఉరితాడు బిగించారని మండిపడ్డారు. భూమి అమ్మిన వాళ్లు ఇప్పుడు మళ్లీ అఫిడవిట్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.
ఈ నిబంధన వల్ల ఒకరికి కూడా సాదాబైనామా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఒక్క సిద్దిపేట రూరల్ మండలంలోనే 2,400, అర్బన్‌లో 1,200 అప్లికేషన్లు వస్తే ఏ ఒకరికీ పాస్‌బుక్ రాలేదని ఉదహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం అన్నట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో 10% ఉన్న నిషేధిత భూముల జాబితా నేడు 20 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, ఈ జాబితాను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మీ అక్రమాలు, ఇష్టారాజ్య వ్యవహారాలకు అడ్డు వ స్తుందని అమలు చేయడం లేదా? అని ప్రశ్నించారు.
ప్రజలకు తెలియకుండానే వారి భూ ములను నిషేధిత జాబితాలో పెడుతుండటం తో పిల్లల పెండ్లిళ్లు, చదువులు, వైద్యం లాంటి అత్యవసరాలకు కూడా భూములు అమ్ముకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు చెల్లించి, స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా రెండున్నరేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకొంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 20 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి సేల్ ఇస్తే, అందులో 61 ఏండ్లు దాటిన 4 వేల మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చామని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకుండా, వారికి ఇంకా ఆ పాత రూ.10 వేల వేతనాన్నే ఇస్తున్నదని మండిపడ్డారు.