జగిత్యాల, జూన్ 20, (నమస్తే తెలంగాణ): రేవంత్ దిక్కుమాలిన పాలనచూసి, మేఘాలు సైతం ముఖం చాటేస్తున్నాయని, క రువు పరిస్థితులు మొదలవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు, రైతుభరోసాపై సందిగ్ధత, కరెంట్‌పై కుట్రలు, సన్నరకాలపై సందిగ్ధం కంటే ఈ వానకాలం క్రాప్ హాలిడేగా ప్రకటించి, రైతుకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని సూచించా రు. ‘ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు, ప్రజా సంక్షేమ వేదిక .. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని పక్కా వ్యాపారసంస్థగా మార్చేందుకు యత్నించడం దుర్మార్గం’ అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం ఎంత కొనుగోలు చేస్తుందో అంతేమొత్తంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన అసంబద్ధ విధానాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ ధాన్యం కొనుగోలుపై మాట్లాడిన మాటలను మీడియా సమక్షంలో ప్రదర్శించారు. వరిలో ఏ రకం ధాన్యానికైనా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇటీవల ఏడు రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని సీఎం ప్రకటించడం చూస్తే బోనస్‌ను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సూచించిన ఏడురకాల ధాన్యాన్ని సాగుచేస్తే ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని, సాధారణ రకం వేస్తే ఎకరానికి 30 క్వింటాళ్లు వస్తుందని చెప్పారు. ఒక్కో క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున లెక్కవేసినా, ఎకరానికి రూ.24,000 రైతులు నష్టపోతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కు ఏడు కిలోల వరకు కోతపెట్టిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా యూరియా కొనుగోలుకు యాప్ పద్ధతి లేద ని, తెలంగాణలో మాత్రమే రైతుల గోస పోసుకునేందుకు ఈ పద్ధతిని రేవంత్ తీసుకొచ్చారని విమర్శించారు.
రేవంత్ పాలనలో 7,600 మంది రైతుకుటుంబాలు బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీటిని ఇచ్చారని, రేవంత్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్ రెండు పిల్లర్లను మరమ్మతు చేయించలేకపోయారని, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌లకు అతీగతీలేద ని విమర్శించారు.. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా వరంగల్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కోరారు. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేకి అని కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని వివరించారు. మాజీమంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, కాంగ్రెస్ దోపిడీని నిలదీస్తామని హెచ్చరించారు.