హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అతి తక్కువదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేవలం 16.9 శాతం బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. కార్మికులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సింగరేణి లాభాల్లో 50 శాతం కోత విధించి కార్మికులను మోసం చేసిందని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బొగ్గుపాలు చేశారని, నికర లాభాల్లో 33 శాతం బోనస్ చెల్లించి రేవంత్‌రెడ్డి సర్కార్ తన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రామగుండంలో నిర్మించనున్న 800 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్‌లో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకునేది లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(టీజీపీఈఏ) స్పష్టంచేసింది. ఈ ప్లాంట్‌ను టీజీజెన్కో ద్వారానే నిర్మించాలని డి మాండ్ చేసింది. ఆదివారం ఎర్రగడ్డలోని జెన్కో ఆడిటోరియంలో టీజీపీఈఏ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నాకర్‌రావు, సదానందం మాట్లాడుతూ.. పాల్వంచ పాత ప్లాంట్ స్థానంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను నిర్మించాలని, 800 మెగావాట్ల కేటీపీపీ స్టేజ్-3 ప్లాంట్‌ను జెన్కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు రెగ్యులర్ సీఎండీలను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు ఏ వెంకటనారాయణరెడ్డి, అడిషనల్ సెక్రటరీ జనరల్ కే అం జయ్య, చీఫ్ అడ్వైజర్ శివశంకర్, సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.