మక్తల్, ఫిబ్రవరి 12 : వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతన్న జీవితంలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చిచ్చు పెడుతున్నది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగుచేసిన పంటలను గురువారం గుత్తేదారులు నేలపాలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా కొడంగల్‌కు సాగునీటిని తీసుకెళ్లేందుకు భీమా ఫేజ్-1లో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే పనులు చేపట్టారు.
కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు చాలీచాలని పరిహారం అందడంతో కొందరు కాట్రేవుపల్లి శివారులో యాసంగిలో పంటలు సాగుచేశారు. పంట చేతికొచ్చే దశలో ఉండగా.. కర్షకులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే.. గుత్తేదారులు పనులు ప్రారంభించారు. పొలాల్లోకి జేసీబీలు దింపి ప్రాజెక్టు పనులు ప్రారంభించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే పథకం పనుల కోసం పంటలను నాశనం చేయడం ఏమిటని నిలదీశారు.