హైదరాబాద్/పెద్దపల్లి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/చెన్నూర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు నోట్ల కట్టలతో కుట్రలకు తెరతీశారు. ఎలాగూ గెలవలేమని భావించిన హస్తం నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఇతర పార్టీల నాయకుల కొనుగోలుకు కరెన్సీ కట్టలను ఎరగా వేస్తున్నారు. ఇలా డబ్బులను చేరవేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు చెందిన వ్యక్తులు గురువారం పోలీసులకు చిక్కారు. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన కంపెనీ ఉద్యోగులు రూ.50 లక్షలు తరలిస్తూ పోలీసులకు చిక్కారు. అలాగే మంథని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు ఫొటోతో ఉన్న రూ.19,600 విలువైన 5,368 గోడ గడియాలను ఫ్లయింగ్ స్క్యాడ్స్ సిబ్బంది పట్టుకున్నారు.
వివేక్ ఆదేశాల మేరకే తరలిస్తున్నాం..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన కంపెనీ ఉద్యోగులు (విశాఖ ఇండస్ట్రీస్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్) కంజుల రవి కిశోర్, (వెలుగు దిన పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి) ముదిగంటి ప్రేమ్‌కుమార్ రూ.50 లక్షలతో హైదరాబాద్ నుంచి చెన్నూర్‌కు బైక్‌పై బయలు దేరారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గురువారం పోలీసులు బైక్‌ను ఆపి వీరి బ్యాగును తనిఖీ చేయగా రూ.50 లక్షలు దొరికాయి. తమ యజమాని వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో డబ్బులు పంచేందుకు, ఇతర పార్టీల నాయకుల కొనుగోలుకు రూ.50 లక్షలు తరలిస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. నగదుతోపాటు రెండు మొబైల్ ఫోన్లు, మోటారు సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీధర్‌బాబు ఫొటోతో గోడగడియారాలు
మంథని కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఓటర్లకు పంచేందుకు తీసుకొస్తున్న శ్రీధర్‌బాబు ఫొటోతో కూడిన గోడ గడియారాలను ఫ్లయింగ్ స్క్యాడ్స్ అండ్ స్టాటిస్టికల్ బృందం పట్టుకున్నది. సుమారు 19,600 విలువైన 5,368 ప్లాస్టిక్ వాల్ క్లాక్‌లను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను పెద్దపల్లి జిల్లా మంథని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గడియారాలను హైదరాబాద్ మలక్‌పేటలోని శ్రీ కృప మార్కెట్లో కొనుగోలు చేసి మంథని నియోజకవర్గంలోని కాటారం రెవెన్యూ డివిజన్లోని చింతకాని ఎక్స్‌రోడ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీ ఏజెన్సీస్‌కు శ్రీరామ ట్రాన్స్పోర్ట్ ద్వారా తరలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వాల్‌క్లాక్‌లను సీజ్‌చేశారు.
కొడంగల్‌లో కొనుగోలు యత్నాలు భగ్నం
ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల కొనుగోలుకు ప్రయత్నించగా ఆ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ నివాసంలో పెద్ద ఎత్తున నగదు, మద్యం నిల్వ చేశారన్న సమాచారంతో మంగళవారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో ఓటర్లను ప్రలోభాలకు గురిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.