హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 14 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయం సాధించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, 10 రౌండ్లతో మధ్యాహ్నం 2 గంటలకే ముగిసింది. తొలి నుంచి ఆఖరి రౌండ్ వరకూ అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గట్టిపోటీనిచ్చారు.
ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు 74,259 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 98,988 ఓట్లు వచ్చాయి. దీంతో 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్‌యాదవ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే రాగా.. తన డిపాజిట్‌ను కోల్పోవడం గమనార్హం. ఓట్ల లెక్కింపు అనంతరం నవీన్‌యాదవ్ ఎంపికైనట్టు ఆయనకు రిటర్నింగ్ అధికారి పీ సాయిరాం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) ఆదివారం నాటితో ముగియనున్నది.