Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అధికారపక్షం చిచ్చరాజేస్తున్నది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే.. తమ కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నది. రాష్ర్టాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుయుత్తులు పన్నుతున్నది. ప్రతిపక్షం ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోతుంటే అధికారపక్షం మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి కవ్వింపు చర్యలు చేపడుతున్నది. పోలీసులు సైతం అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి పోలీసుల పక్షపాత వైఖరే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. పది నెలలుగా అధికార పక్షంపై రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతున్నా పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. సాక్షాత్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపైనే కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడితే వారిని అరెస్టు చేయకపోవడం పోలీసుల పక్షపాతవైఖరిని స్పష్టం చేస్తున్నది. ఇటీవల బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయగా, ఆ తర్వాత పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లి నానా హంగామా సృష్టించారు.
తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంట్లో అదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇంటి బయట, నట్టింట్లో పటాకులు కాల్చారు. నిద్రపోతున్న పనివారిపై భౌతిక దాడులకు తెగబడి, తీవ్రంగా గాయపర్చారు. ఈ దాడిని వీడియో తీస్తున్న ఓ కానిస్టేబుల్‌పైనా భౌతికదాడికి పాల్పడి పాల్పడ్డారు. అయినా, వారిపై ఎలాంటి చర్యలు లేవు. అరెస్టులు అసలే లేవు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై దాడులు చేసినా, వారి ఆస్తులు ధ్వంసం చేసినా కేసులు కానీ, అరెస్టులు కానీ ఉండటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో ఈ తరహా దాడులు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నా ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. కొందరిపై కేసులు పెట్టి పోలీసులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఖమ్మంలో పేదలకు సాయం చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు వెళ్తే అక్కసుతో దాడికి పాల్పడినా అరెస్టులు లేవు. మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసినా అరెస్టులు లేవు.
నల్లగొండలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిశోర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడినా అరెస్టులు లేవు. పాడి కౌశిక్‌రెడ్డి అంశంలో ఎమ్మెల్యే గాంధీ, అతని అనుచరులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినా అరెస్టు లేదు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడికి చేస్తే అరెస్టులు లేవు. ఈ వరుస సంఘటనలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇటీవల డీజీపీని కలిసి వినతిపత్రం సైతం అందించారు. నర్సాపూర్ దాడిపై మాజీ మంత్రి హరీశ్‌రావు డీజీపీ జితేందర్, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీలతో మాట్లాడినా చర్యలు శూన్యం.