ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులతో కలిసి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. 450 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు పెట్టుబడికి డబ్బులు లేక, ఎరువులు కొనక దిగుబడి తగ్గే అవకాశం ఉన్నదని సారంగపూర్‌లో రైతులు ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

వరద కాల్వకు వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కన్నెకల్, నారాయణపురం, దాచారం, మాడ్గులపల్లి, సీత్యాతండా గ్రామాల రైతులు వరద కాల్వపై ఆధారపడి పంటలు సాగు చేశారని, పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం వరద కాల్వకు నీటిని నిలిపేయడంతో దాదాపు 500 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. వరద కాల్వ ద్వారా సాగునీటిని ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద వాగులోకి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ నంగునూరు మండలంలోని రాంపూర్ చౌరస్తాలో గురువారం సిద్దిపేట – హనుమకొండ హైవేపై అక్కెనపల్లి రైతులు బైఠాయించారు. రంగనాయకసాగర్ ద్వారా సాగునీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే మోయతుమ్మెద వాగులోని అన్ని చెక్‌డ్యామ్‌లను నీటితో నింపి పంటలను కాపాడాలని రైతులు కోరారు.